Wednesday, December 25, 2013

Tulasi Stotram


Tulasi Shodasanamani


Tulasi Kavacham


శ్లోకము: అహింసా ప్రథమం పుష్పం, పుష్ప మింద్రియ నిగ్రహః
సర్వ భూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః
శాంతి:పుష్పం, తపః పుష్పం, ధ్యానం పుష్పం తధైవచ
సత్యమష్ట విధం పుష్పం విష్ణో:ప్రీతికరం భవేత్ .

భావము:-
అహింస, ఇంద్రియ నిగ్రహము, సర్వ భూత దయ, ఓర్పు, శాంతి, పరమాత్మకై తపించుట, పరమాత్మ ధ్యానము సత్యనిరతి అనే ఎనిమిది విధాలైన పుష్పాలతో శ్రీహరిని ఆరాధిస్తే అనుగ్రహిస్తాడని విశ్వాసం.

శ్రీహరి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు, పునస్కారాలకంటే పై ఎనిమిది రకాలైన పుష్పాలతో పూజించడం ద్వారా సకల సంతోషాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.
 — 

తిరుప్పావై --- 7 పాశురం

కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు
వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్
ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్.

కీశూకీశు మనుచు ఏటిరింతలు కలసి
ఊసులాడెనదె! వినలేదా వెర్రిదానా!
కాసుల పేరుల, కొప్పుల ఘుమఘుమలు
కవ్వముల చిలుకు పెరుగు సవ్వడి వినలేదా //కీశుకీశు//
గోపికా నాయకీ! నారాయణుని మూర్తి
కేశవుని నామములు పాడగా వింటివా? పరుంటివా?
తేజోవతీ లేచి తెరువవే తలుపు
జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము.

నిన్న ఒక గోపికను మేల్కొల్పడంలో శ్రీవ్రతం మొదలైంది కదా. ఈరోజు శ్రవణము లో వైవిధ్యమును వివరిస్తూ ఇంకో గోపికను నిద్ర మేల్కొల్పుతున్నారు. వేదపఠనము, శుభకార్యము మొదలుపెట్టేటప్పుడు శ్రీ గురుభ్యోనమః, హరిః, ఓమ్ అని ప్రారంభిస్తారు. నిన్న పక్షుల శబ్దములు, శంఖనాదము, హరి హరీ అనే ధ్వనులు వినలేదా అని గోపికను అడిగారు. దీనివలన గురువును, హరిని తలుచుకున్నట్టుగా భావించాలి. ఈ పాశురంలో భగవన్నామ శ్రవణంలో గల ప్రాముఖ్యాన్ని వివరిస్తున్నారు. భరద్వాజ పక్షులు తెల్లవారుఝామునే లేచి అన్ని వైపులలో ఉన్న పక్షులను కలుపుకుని మాట్లాడుతున్నాయి. ఆ ధ్వని నీకు వినపడలేదా? ఓసి పిచ్చిదానా! పువ్వులు ముడిచిన కొప్పులు విడిపోగా పరిమళాలు వెదజల్లుతున్న గొల్లభామలు కవ్వముతో పెరుగు చిలుకుతుంటే వారి గాజుల గలగలలు, వారి మెడలోని ఆభరణాల ధ్వని, మంగళసూత్రముల చప్పుడు, వారు చిలుకుతున్న పెరుగు సవ్వడి నీకు వినపడలేదా? ఓ నాయకురాలా! ప్రపంచమంతా తన ప్రేమ వాత్సల్యాలతో వ్యాపించియున్న పరమాతం మనకు కనపడాలనే మానవదేహాన్ని ధరించి శ్రీకృష్ణుడై అవతరించాడు. లోకకంటకులైనవారిని సంహరించిన ఆ స్వామిని మేము పెద్దగా కీర్తిస్తుంటే కూడా నీకు వినపడలేదా? విని కూడా మేల్కొనడంలేదా? నీ తేజస్సు మాకు అగుపిస్తున్నది. లేచి ఇకనైనా తలుపు తెరువుము అని మేల్కొలుపుతున్నారు ...


భరద్వాజ పక్షులు మామూలు పక్షులు కావు. వాటి మాటలు మామూలు మాటలు కావు. ప్రయాణానికి పోయేవాళ్ళు త్రోవలో తినడానికి మూటకట్టుకున్నట్లు ఈ పక్షులు ఉదయాన్నే లేచి పగలంతా కలిగే ఎడబాటులో తమకు తోడుగా ఉండడానికి, గుర్తుచేసుకోవడానికా అన్నట్టు ముచ్చట్లాడుతున్నాయి. ఆ మాటల ధ్వని వినపడలేదా అని గోదాదేవి అడుగుతుంది. వ్రేపల్లెలో గోపికలకు పెరుగు చిలకడం అనేది నిత్యకృత్యం. ఎంతటివారైనా తమ నిత్యకృత్యములను ఎప్పుడూ మరచిపోరాడు. వీడరాదు. చల్ల చేసేటప్పుడు పాటలు పాడుకుంటూ తన్మయులై ఉన్న గోపికల కొప్పులు ఊడిపోయి పూవులు జారిపోయి వాటి పరిమళాలు వ్యాపించాయి. వారి ఆభరణాలు, చేతి గాజులు గల్లుగల్లుమంటూ చప్పుడు చేస్తున్నాయి. అమృతాన్ని సాధించడానికి ఆనాడు దేవతలు, రాక్షసులు చేసిన క్షీరసాగరమధనం లాంటిదే ఈ గోపికల నిత్యకృత్యం. మనము మధించే క్షీరసాగరం ఆ పరమాత్మ.అందలి పాలు ఆ దేవుని రూపం, గుణగణాలు. వానిని మననం చేయడమే మధించుట. దానికోసం ఆ దేవునిపై నిలిపిన పట్టుదల మంధరపర్వతం. దానికి కట్టిన తాడే మన శ్రద్ధ, ఇష్టము. ఈ మధనంలో జరిగే పోరాటంలో దైవశక్తులు జయించి మనకు భగవతుని సాన్నిధ్యం లభిస్తుంది.

నిన్నటి పాశురంలో, ఈ పాశురంలో ఎక్కువగా వినడం గురించి ప్రస్తావించారు. ఈ రెండు పాశురాలు ఆధ్యాత్మిక సాధనకు ప్రధమ సోపానమైన శ్రవణం యొక్క ప్రాధాన్యతను వివరిస్తున్నాయి. ఇందులో మనకు చెప్పినవి పక్షుల కలకలం, భరద్వాజ పక్షుల మాటలు. ఈ రెండూ వేదశాస్త్రాలను వినడం గురించి ప్రస్తావిస్తున్నాయి. రెండోది దేవాలయంలో మ్రోగించు శంఖద్వని, పెరుగు చిలికే గోఫికల గాజులు, నగలు, పెరుగు సవ్వడి . వారు కనపడకున్నా ఈ శబ్దాలను బట్టి ఊహించుకోవడమన్నమాట. మూడవది మునులు, యోగులు గానం చేస్తున్న హరీహరీ అనే శబ్దం. ఇది ఆచార్యోపదేశము వంటిది.. అన్నీ ముఖ్యమైనవే. వీరు ఆ గోపికను పిచ్చిపిల్లా, నాయకురాలా! తేజశ్సాలినీ! అని మూడు విధాల పిలిచారు. భగవంతుని అనుగ్రహం కల్గి బ్రహ్మ తేజస్సు నీలో కనిపిస్తుండగా లేదనడం తగినపని కాదు... ఆ అనుభవం నీవు ఒక్కదానివే అనుభావిస్తున్నావు అలా తగదమ్మా!ఏమమ్మా నీకు పిచ్చా అని వీరడుగుతున్నారు. ఇలా చెప్పుకుంటూ రెండవ గోపికను నిద్రలేపి ముందుకు సాగారు






తిరుప్పావై --- 8 పాశురం

కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు

మెయ్యాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం

పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు ఉన్నై -

క్కూవువాన్ వందు నిన్ఱోం కోదుగలం ఉడైయ

పాపాయ్! ఎళుందిరాయ్ పాడి ప్పఱై కొండు

మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ

దేవాది దేవనై చ్చెన్ఱు నాం శేవిత్తాల్

ఆవా ఎన్ఱారాయుందరుళ్-ఏలోర్ ఎంబావాయ్

రాగం: చక్రవాకం

తూరుపు తెలవారె నెచ్చెలీ మేలుకో!

ఎనుములు చిరుబీడుకు మేయగా ఏగెనే

బాలికలందరు అదే పోతగా పోతుంటే

ఆపి, నిను పిలువగా వచ్చి నిలచి నామమ్ము // తూరుపు //

శ్రీకృష్ణు కీర్తించి పరవాద్యమును పొంద

కేశినోటిని చీల్చి, మల్లుర నణచిన

దేవదేవుని చేరి సేవించి నిలువగా

అయ్యో! మీరే వచ్చిరా అనుచు కటాక్షించు..

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.

ఈరోజు నిద్రలేపబోయే గోపిక కృష్ణుడికి కూడా ఆసక్తి కలిగించే విలాసవతి. కృష్ణుడి దగ్గరకు నేనెందుకు వెళ్లాలి? అతటే నా దగ్గరకు రావాలి అనే ధీమాతో పడుకుని ఉంది. పరమాత్మ మీద అంత అచంచలమైన విశ్వాసం ఉన్న ఆమె తమ తోడు లేకుంటే ఈ వ్రతం ముందుకు సాగదని తెలిసిన గోపికలు ఆమెను మేల్కొల్పుతున్నారు.

తూరుపు దిక్కున తెల్లని కాంతి వ్యాపిస్తుంది. మేతకు విడిచిన గేదెలు అన్ని దిక్కులకు వెళ్ళనారంభించాయి. మనతోటి పిల్లలు వ్రతస్థలానికి వెళ్లాలని బయలుదేరారు. శ్రీకృష్ణునివద్దకు వెళ్ళడం చాలా ముఖ్యమని భావించి వారందరూ అలా వెళ్తున్నారు. అలా వెళ్ళెవారిని నిలిపి మరీ నిన్ను పిలవడానికి నీ గుమ్మం ముందు నిలబడ్డాం. కుతూహలంగల ఓ పిల్లా తొందరగా నిద్ర లేచిరా!!. ఆ కృష్ణుని గుణగానము చేసి వ్రతానికి చాలా అవసరమైన పర అనే సాధనాన్ని సంపాదించి, కేశి అనే రాక్షసుని సంహరించి, చాణూర ముష్టికులనే మల్లయోధులను చంపిన ఆ భగవంతుని సమీపించి సేవించినపుడు అతడు మెచ్చుకుని "అయ్యో! మీరే వచ్చారా " అని బాధపడి మనను పరిశీలించి మన కోరికను నెరవేరుస్తాడు. కనుక వెంటనే లేచి రా" అని ఆ గోపికను మేల్కొలుపుతున్నారు.
సూర్యోదయానికి ముందు తూరుపు తెల్లబడటం అనగా మనలో సత్వగుణము ప్రభవించి, రాజస తామస భావాలు తగ్గడం. అదే జ్ఞానోదయానికి ముందు కలిగే మానసిక పశాంతత. భక్తులందరూ సాధారణంగా భగవంతుడిని మేల్కొలుపుతారు. కాని గోదాదేవి మాత్రం భగవంతుని ప్రియ భక్తులను మేల్కొలుపుతుంది. శ్రీకృష్ణుడు కేశి అనే రాక్షసుని చంపాడని కీర్తిస్తున్నారు. ఈ కేశి అనేది అహంకారము. మనలోని అహంకారం, మమకారాలను పట్టి చీల్చవలసింది ఆ పరమాత్మే కదా.. అదే విధంగా మనలోని కామ క్రోధాలనే మల్లురను కూడా ఆ దేవదేవుడే తొలగించాలి. పరమాత్మను మేము ప్రత్యక్షంగా చూసామని ఎవ్వరూ చెప్పలేరు. అలా చెప్పేవారంతా మానసిక సాక్షాత్కారం పొందినవాళ్లే. కాని ముదలాళ్వార్లు ముగ్గురు, పెరియాళ్వార్లు మున్నగువారు ఆ శ్రీమన్నారాయణుని ప్రత్యక్షంగా దర్శించారు. అలాగే మొన్నా, నిన్నా, ఇవాళ మేల్కొన్న గోపికలు ముగ్గురూ భగవదనుభవంలో మునిగి ప్రపంచాన్ని మరచి సుషుప్తిలో ఉండిపోయారు.





తిరుప్పావై --- 11 పాశురం

కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు
శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం
కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం పొఱ్కొడియే
పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు నిన్-
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్-పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ-
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్ ఎన్బావాయ్


రాగం: కేదారగౌళ

వేల లేగదూడల ఆవుల పాలు వేగ పిడికెడువారు
అరుల బలము అణగ పోరు సైపెడువారు
దోషమించుక లేని గోప వంశస్వర్ణలతా!
పుట్టలోని పాము బోలు కటికల వనమయూరీ!
రావే! వయ్యారీ! రావే! శ్రీమంతురాలా! //లేగదూడల//
చుట్టాలు చెలులూ అందరు నీ ముంగిట నిలచీ
నీలమేఘ శ్యామ సుందరుని కీర్తింప
ఉలుకవు పలుకవు నీ నిద్రకర్ధమేమి?!
చెలియరో చెప్పవే - వేగ మేల్కొనవె
జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము..

Friday, July 19, 2013

ద్వారకా తిరుమల :

దీనినే " చిన్న తిరుపతి " అని కూడా అంటుంటారు.ఇక్కడ శేషాద్రి కొండపై శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు దీరియున్నారు. ఇది ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చాలా ప్రసిద్ది చెందిన దేవాలయము. స్వయంభువుగా ప్రత్యక్షమైన వేంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశమునకు ద్వారక తిరుమల అని పేరు వచ్చినది. సుదర్శన క్షేత్రమైన ద్వారక తిరుమల చిన్నతిరుపతిగా ప్రసిద్ది చెందినది. ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట. కనుక ఆ మునికి ప్రత్యక్షమైన స్వామి దక్షిణాభిముఖుడై యున్నాడు.

"పెద్దతిరుపతి" (తిరుమల తిరుపతి)లో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును "చిన్నతిరుపతి"లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుంది. కాని చిన్నతిరుపతిలో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని స్థానికంగా భక్తుల నమ్మకం. ఒకే విమాన శిఖరము క్రింద రెండు విగ్రహములు ఉండటము ఇక్కడి విశేషము. ఒక విగ్రహము సంపూర్ణమైనది. రెండవది స్వామియొక్క పై భాగము మాత్రమే కనుపించు అర్ధ విగ్రహము.

Visheshalu :

1. శేషాచలము, అనంతగిరి అని పిలువబడే ఈ ద్వారకా తిరుమల క్షేత్ర మహత్యం బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది.

2 .మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉడడం కూడా అరుదు.

3 .ఒకే గోపురం కింద రెండు విగ్రహాలు ఉండటం ఇక్కడి విశేషం. స్వామి అసలు విగ్రహం వక్షస్థలం వరకు మాత్రమే కనిపిస్తుంది. మిగతా భాగం కొండలోనే నిక్షిప్తమై ఉంది.
స్వామి వెనుక భాగంలో ఉండే పూర్తి విగ్రహాన్ని (రెండోది) పదకొండో శతాబ్దంలో శ్రీమద్రామానుజుల వారు ప్రతిష్ఠించారు.

4. పెద్దతిరుపతి" (తిరుమల తిరుపతి)లో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును "చిన్నతిరుపతి"లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుంది. కాని చిన్నతిరుపతిలో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని భక్తుల నమ్మకం.

5 .ఇక్కడ స్వామి వారికి అభిషేకము చేయక పోవడము ఇంకొక విశేషము. ఒక చిన్న నీటి బొట్టు పడినా అది స్వామి విగ్రహము క్రిందనున్న ఎర్రచీమలను కదుల్చును. ఆ పుట్టలో స్వామి వున్నట్లున్న పాద ముద్రికలు ఇప్పటికి కనబడుతున్నాయట.

6. ఇక్కడ ఒక కుంకుడు చెట్టుంది. ఈ చెట్టు మీద గరుడ పక్షి కొన్ని సమయాల్లో వచ్చి వ్రాలుతుందట. ఆనాడు శ్రీవేంకటేశుడు తిరుపతి నుండి ద్వారకా తిరుమలకి వస్తారని ప్రతీతి.
ఇక్కడ దొరికే ప్రతిశిల యందు సుదర్శన ముద్ర కన్పిస్తుంది. ఇది చాలా గొప్ప విశేషమయిన సంగతి.

7. ఆలయ సింహద్వారములు వేసినా, మబ్బుపట్టి చీకట్లు కమ్ముకొన్నా ఆలయగోపురము నుండి ఒక దివ్యమైన జ్యోతి దర్శనమిస్తుంది. దగ్గర నుంచి అయితే చిన్న దీపంగాను 200 మీటర్ల దూరం నుంచి చూస్తే పెద్ద వెలుగుగాను చూడవచ్చు

స్థల పురాణము ప్రకారము ఈ క్షేత్రము రాముని తండ్రి దశరథ మహారాజు కాలము నాటిదని భావిస్తారు. "ద్వారకుడు" అనే ఋషి తపసు చేసి స్వామివారి పాదసేవను కోరాడు. కనుక పాదములు పూజించే భాగ్యం అతనికి దక్కింది. పైభాగము మాత్రమే మనకు దర్శనమిస్తుంది. విశిష్టాద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించినారనీ, అందరూ స్వామి పాదపూజ చేసుకొనే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త ధృవమూర్తికి వెనుకవైపు పీఠంపై వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్టించారని అంటారు. స్వయంభువుగా వెలసిన, అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే, ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందనీ, తరువాత ప్రతిష్టింపబడిన పూర్తిగా కనుపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్ధకామ పురుషార్ధములు సమకూరుతాయనీ భక్తుల విశ్వాసం.

ప్రతియేటా రెండు కళ్యానోత్సవములు వైశాఖ మరియు ఆశ్వయిజ మాసములలో జరుపుతారు. ఇందుకు కారణం- స్వయంభూమూర్తి వైశాఖమాసంలో దర్శనమిచ్చారనీ, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజంలో ప్రతిష్టించారనీ చెబుతారు.

గర్భగుడిలో స్వయంభూ వేంకటేశ్వర స్వామి, ప్రతిష్టింపబడిన వేంకటేశ్వరస్వామి ప్రతిమలు కన్నులపండువుగా దర్శనమిస్తాయి. ఆ ప్రక్కనే కుడివైపు అర్ధ మంటపంలో తూర్పు ముఖంగా మంగతాయారు, అండాళ్ (శ్రీదేవి, భూదేవి) అమ్మవార్లు కొలువై ఉన్నారు. శుక్రవారం అమ్మవార్లకు విశేష కుంకుమపూజ చేస్తారు.

కొండపైన ప్రధానాలయానికి నాయువ్య దిశలో కొద్దిదూరంలోనే కొండమల్లేశ్వరస్వామి, భ్రమరాంబికల ఆలయం ఉంది. భ్రమరాంబా మల్లేశ్వరస్వామి ఈ ద్వారకా తిరుమల క్షేత్రానికి క్షేత్ర పాలకుడు. మొత్తం కొండ సర్పరాజు అనంతుని ఆకారంలో ఉన్నదనీ, తలపైన శివుడు, తోక పైన విష్ణువు కొలువు తీరారనీ చెబుతారు. ఈ దేవాలయంలో గణపతి, భ్రమరాంబ, మల్లేశ్వరస్వామి కొలువుతీరు ఉన్నారు. నవగ్రహ మందిరం కూడా ఉంది. ఆలయం తూర్పున "శివోద్యానం" అనే పూలతోట ఉంది.

ఆలయం కొండకు 1 కి.మీ. దూరంలో "కుంకుళ్ళమ్మ" ఆలయం ఉంది. ఈమె ఈ వూరి గ్రామదేవత. ప్రధాన ఆలయంలో స్వామి దర్శనం చేసుకొన్న భక్తులు తిరిగి వెళుతూ కుంకుళ్ళమ్మ దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. ఈ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు.

Thursday, July 18, 2013


శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం ( అన్నవరం )

అన్నవరం ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలానికి చెందిన గ్రామము. అన్నవరం కలకత్తా - మద్రాసు జాతీయ రహదారి పై రాజమండ్రి నుండి దాదాపుగా 70 కి.మీ, కాకినాడ కి 45 కి.మి. దూరంలో ఉంది. ఈ గ్రామంలోని అన్నవరం రైల్వే స్టేషన్ విశాఖపట్టణం-విజయవాడ రైలుమార్గంలో వస్తుంది.

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ కొలువైన త్రిమూర్తి నిలయం అన్నవరం. ఈ ఆలయం రెండు అంతస్థులలో నిర్మింపబడింది. క్రింది భాగంలో యంత్రం, పై అంతస్థులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంది. క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణు మూర్తి గా అర్చిస్తారు, మధ్యభాగంలో ఉన్నదానిని శివునిగా పూజిస్తారు. మూలవిరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింప బడడం ఇక్కడి విశేషం. త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉన్నది. అలా త్రిమూర్తులు వెలసిన ఈ అరుదైన ఆలయానికి యుగాల చరిత్ర ఉందంటారు భక్తులు.

శ్రీ సత్యనారాయణ స్వామివారిని ఈ క్రింది విధంగా స్తుతిస్తారు.

మూలతో బ్రహ్మరూపాయ
మధ్యతశ్చ మహేశ్వరం
అధతో విష్ణురూపాయ
త్ర్త్యెక్య రూపాయతేనమః


స్థలపురాణం:

పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందారు. వారు రత్నాకరుడు, భద్రుడు. వీరు పరమ విష్ణు భక్తులు. వారు హరిని తమ శిరస్సున దాల్చాలన్న కోరికతో తపస్సు చేసారు. వారి కోరిక మేరకు నారాయణుడు భద్రుని శిరస్సుపై (భద్రాచలం) వైకుంఠ రాముడిగానూ, రత్నాకరుడి (రత్న గిరి)పై సత్యనారాయణుడి గానూ అవతరించారు.

దేవాలయ ప్రాశస్తి:

తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురంకి సమీపంలో గోరస గ్రామ ప్రభువు (గోర్సా, కిర్లంపూడి ఎస్టేట్స్) శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామానారాయణం బహద్దరు రాజా ఐ.వి.రామనారాయణం వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు వీరికీ, శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామానారాయణిం బహద్దరు వారికీ ఏక కాలంలో కలలో కనపడి "రాబోవు శ్రావణ శుక్ల విదియా మఖా నక్షత్రములో గురువారము నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను. నీవు నన్ను శాస్త్రనియమానుసారము ప్రతిష్టించి సేవించుము" అని చెప్పి మాయమయ్యారు.

మరునాడు ఇరువురు కలసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరు అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామి వారి పాదముల మీద సూర్యకిరణములు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి, స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండ పైకి తీసుకొని పోయి, కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణుపంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891, ఆగష్టు 6 వ తేదీన (శాలివాహన శకం 1813) ప్రతిష్టించారు.

ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి, నాలుగు దిక్కులలో నాలుగు చక్రాలతో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునక. వనదుర్గ ఆలయం, రామాలయాలు ప్రక్కన కనిపిస్తూ ఉంటాయి. ఆలయ రూపం, అగ్ని పురాణంలో చెప్పబడినట్లు, ప్రకృతిని తలపిస్తూ ఉండాలి.

పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నములు గలవి, శూల శిఖరములతో ఉన్నవి అయిన రెండు చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్య దేవతా, అంబికా దేవతా ప్రతీకలగు చక్రశిఖరములు ఉన్న మరి రెండు విమాన గోపురాలూ ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధములైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం.

పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉన్నది. ఈ గుడికి పాదచారులు చేరు కోవడానికి 460 మెట్లు ఉన్నాయి.

ప్రతీ ఏటా పదిలక్షల మంది భక్తులు అన్నవరంలో వ్రతమాచరిస్తారని అంచనా.

వీరత్వానికీ, సత్యానికీ ప్రతీకగా భావించే మీసాలరాముడి కల్యాణోత్సవాలను ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి బహుళ పాడ్యమి వరకూ అంగరంగ వైభవంగా జరుపుతారు భక్తులు.

ఇక్కడి ఇంకో విశేషం ప్రసాదం. గోధుమరవ్వతో ఆలయ ప్రసాదశాలలో తయారయ్యే ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బయటి వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ రుచి మాత్రం రాదు.