Wednesday, December 25, 2013


తిరుప్పావై --- 7 పాశురం

కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు
వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్
ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్.

కీశూకీశు మనుచు ఏటిరింతలు కలసి
ఊసులాడెనదె! వినలేదా వెర్రిదానా!
కాసుల పేరుల, కొప్పుల ఘుమఘుమలు
కవ్వముల చిలుకు పెరుగు సవ్వడి వినలేదా //కీశుకీశు//
గోపికా నాయకీ! నారాయణుని మూర్తి
కేశవుని నామములు పాడగా వింటివా? పరుంటివా?
తేజోవతీ లేచి తెరువవే తలుపు
జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము.

నిన్న ఒక గోపికను మేల్కొల్పడంలో శ్రీవ్రతం మొదలైంది కదా. ఈరోజు శ్రవణము లో వైవిధ్యమును వివరిస్తూ ఇంకో గోపికను నిద్ర మేల్కొల్పుతున్నారు. వేదపఠనము, శుభకార్యము మొదలుపెట్టేటప్పుడు శ్రీ గురుభ్యోనమః, హరిః, ఓమ్ అని ప్రారంభిస్తారు. నిన్న పక్షుల శబ్దములు, శంఖనాదము, హరి హరీ అనే ధ్వనులు వినలేదా అని గోపికను అడిగారు. దీనివలన గురువును, హరిని తలుచుకున్నట్టుగా భావించాలి. ఈ పాశురంలో భగవన్నామ శ్రవణంలో గల ప్రాముఖ్యాన్ని వివరిస్తున్నారు. భరద్వాజ పక్షులు తెల్లవారుఝామునే లేచి అన్ని వైపులలో ఉన్న పక్షులను కలుపుకుని మాట్లాడుతున్నాయి. ఆ ధ్వని నీకు వినపడలేదా? ఓసి పిచ్చిదానా! పువ్వులు ముడిచిన కొప్పులు విడిపోగా పరిమళాలు వెదజల్లుతున్న గొల్లభామలు కవ్వముతో పెరుగు చిలుకుతుంటే వారి గాజుల గలగలలు, వారి మెడలోని ఆభరణాల ధ్వని, మంగళసూత్రముల చప్పుడు, వారు చిలుకుతున్న పెరుగు సవ్వడి నీకు వినపడలేదా? ఓ నాయకురాలా! ప్రపంచమంతా తన ప్రేమ వాత్సల్యాలతో వ్యాపించియున్న పరమాతం మనకు కనపడాలనే మానవదేహాన్ని ధరించి శ్రీకృష్ణుడై అవతరించాడు. లోకకంటకులైనవారిని సంహరించిన ఆ స్వామిని మేము పెద్దగా కీర్తిస్తుంటే కూడా నీకు వినపడలేదా? విని కూడా మేల్కొనడంలేదా? నీ తేజస్సు మాకు అగుపిస్తున్నది. లేచి ఇకనైనా తలుపు తెరువుము అని మేల్కొలుపుతున్నారు ...


భరద్వాజ పక్షులు మామూలు పక్షులు కావు. వాటి మాటలు మామూలు మాటలు కావు. ప్రయాణానికి పోయేవాళ్ళు త్రోవలో తినడానికి మూటకట్టుకున్నట్లు ఈ పక్షులు ఉదయాన్నే లేచి పగలంతా కలిగే ఎడబాటులో తమకు తోడుగా ఉండడానికి, గుర్తుచేసుకోవడానికా అన్నట్టు ముచ్చట్లాడుతున్నాయి. ఆ మాటల ధ్వని వినపడలేదా అని గోదాదేవి అడుగుతుంది. వ్రేపల్లెలో గోపికలకు పెరుగు చిలకడం అనేది నిత్యకృత్యం. ఎంతటివారైనా తమ నిత్యకృత్యములను ఎప్పుడూ మరచిపోరాడు. వీడరాదు. చల్ల చేసేటప్పుడు పాటలు పాడుకుంటూ తన్మయులై ఉన్న గోపికల కొప్పులు ఊడిపోయి పూవులు జారిపోయి వాటి పరిమళాలు వ్యాపించాయి. వారి ఆభరణాలు, చేతి గాజులు గల్లుగల్లుమంటూ చప్పుడు చేస్తున్నాయి. అమృతాన్ని సాధించడానికి ఆనాడు దేవతలు, రాక్షసులు చేసిన క్షీరసాగరమధనం లాంటిదే ఈ గోపికల నిత్యకృత్యం. మనము మధించే క్షీరసాగరం ఆ పరమాత్మ.అందలి పాలు ఆ దేవుని రూపం, గుణగణాలు. వానిని మననం చేయడమే మధించుట. దానికోసం ఆ దేవునిపై నిలిపిన పట్టుదల మంధరపర్వతం. దానికి కట్టిన తాడే మన శ్రద్ధ, ఇష్టము. ఈ మధనంలో జరిగే పోరాటంలో దైవశక్తులు జయించి మనకు భగవతుని సాన్నిధ్యం లభిస్తుంది.

నిన్నటి పాశురంలో, ఈ పాశురంలో ఎక్కువగా వినడం గురించి ప్రస్తావించారు. ఈ రెండు పాశురాలు ఆధ్యాత్మిక సాధనకు ప్రధమ సోపానమైన శ్రవణం యొక్క ప్రాధాన్యతను వివరిస్తున్నాయి. ఇందులో మనకు చెప్పినవి పక్షుల కలకలం, భరద్వాజ పక్షుల మాటలు. ఈ రెండూ వేదశాస్త్రాలను వినడం గురించి ప్రస్తావిస్తున్నాయి. రెండోది దేవాలయంలో మ్రోగించు శంఖద్వని, పెరుగు చిలికే గోఫికల గాజులు, నగలు, పెరుగు సవ్వడి . వారు కనపడకున్నా ఈ శబ్దాలను బట్టి ఊహించుకోవడమన్నమాట. మూడవది మునులు, యోగులు గానం చేస్తున్న హరీహరీ అనే శబ్దం. ఇది ఆచార్యోపదేశము వంటిది.. అన్నీ ముఖ్యమైనవే. వీరు ఆ గోపికను పిచ్చిపిల్లా, నాయకురాలా! తేజశ్సాలినీ! అని మూడు విధాల పిలిచారు. భగవంతుని అనుగ్రహం కల్గి బ్రహ్మ తేజస్సు నీలో కనిపిస్తుండగా లేదనడం తగినపని కాదు... ఆ అనుభవం నీవు ఒక్కదానివే అనుభావిస్తున్నావు అలా తగదమ్మా!ఏమమ్మా నీకు పిచ్చా అని వీరడుగుతున్నారు. ఇలా చెప్పుకుంటూ రెండవ గోపికను నిద్రలేపి ముందుకు సాగారు






తిరుప్పావై --- 8 పాశురం

కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు

మెయ్యాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం

పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు ఉన్నై -

క్కూవువాన్ వందు నిన్ఱోం కోదుగలం ఉడైయ

పాపాయ్! ఎళుందిరాయ్ పాడి ప్పఱై కొండు

మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ

దేవాది దేవనై చ్చెన్ఱు నాం శేవిత్తాల్

ఆవా ఎన్ఱారాయుందరుళ్-ఏలోర్ ఎంబావాయ్

రాగం: చక్రవాకం

తూరుపు తెలవారె నెచ్చెలీ మేలుకో!

ఎనుములు చిరుబీడుకు మేయగా ఏగెనే

బాలికలందరు అదే పోతగా పోతుంటే

ఆపి, నిను పిలువగా వచ్చి నిలచి నామమ్ము // తూరుపు //

శ్రీకృష్ణు కీర్తించి పరవాద్యమును పొంద

కేశినోటిని చీల్చి, మల్లుర నణచిన

దేవదేవుని చేరి సేవించి నిలువగా

అయ్యో! మీరే వచ్చిరా అనుచు కటాక్షించు..

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.

ఈరోజు నిద్రలేపబోయే గోపిక కృష్ణుడికి కూడా ఆసక్తి కలిగించే విలాసవతి. కృష్ణుడి దగ్గరకు నేనెందుకు వెళ్లాలి? అతటే నా దగ్గరకు రావాలి అనే ధీమాతో పడుకుని ఉంది. పరమాత్మ మీద అంత అచంచలమైన విశ్వాసం ఉన్న ఆమె తమ తోడు లేకుంటే ఈ వ్రతం ముందుకు సాగదని తెలిసిన గోపికలు ఆమెను మేల్కొల్పుతున్నారు.

తూరుపు దిక్కున తెల్లని కాంతి వ్యాపిస్తుంది. మేతకు విడిచిన గేదెలు అన్ని దిక్కులకు వెళ్ళనారంభించాయి. మనతోటి పిల్లలు వ్రతస్థలానికి వెళ్లాలని బయలుదేరారు. శ్రీకృష్ణునివద్దకు వెళ్ళడం చాలా ముఖ్యమని భావించి వారందరూ అలా వెళ్తున్నారు. అలా వెళ్ళెవారిని నిలిపి మరీ నిన్ను పిలవడానికి నీ గుమ్మం ముందు నిలబడ్డాం. కుతూహలంగల ఓ పిల్లా తొందరగా నిద్ర లేచిరా!!. ఆ కృష్ణుని గుణగానము చేసి వ్రతానికి చాలా అవసరమైన పర అనే సాధనాన్ని సంపాదించి, కేశి అనే రాక్షసుని సంహరించి, చాణూర ముష్టికులనే మల్లయోధులను చంపిన ఆ భగవంతుని సమీపించి సేవించినపుడు అతడు మెచ్చుకుని "అయ్యో! మీరే వచ్చారా " అని బాధపడి మనను పరిశీలించి మన కోరికను నెరవేరుస్తాడు. కనుక వెంటనే లేచి రా" అని ఆ గోపికను మేల్కొలుపుతున్నారు.
సూర్యోదయానికి ముందు తూరుపు తెల్లబడటం అనగా మనలో సత్వగుణము ప్రభవించి, రాజస తామస భావాలు తగ్గడం. అదే జ్ఞానోదయానికి ముందు కలిగే మానసిక పశాంతత. భక్తులందరూ సాధారణంగా భగవంతుడిని మేల్కొలుపుతారు. కాని గోదాదేవి మాత్రం భగవంతుని ప్రియ భక్తులను మేల్కొలుపుతుంది. శ్రీకృష్ణుడు కేశి అనే రాక్షసుని చంపాడని కీర్తిస్తున్నారు. ఈ కేశి అనేది అహంకారము. మనలోని అహంకారం, మమకారాలను పట్టి చీల్చవలసింది ఆ పరమాత్మే కదా.. అదే విధంగా మనలోని కామ క్రోధాలనే మల్లురను కూడా ఆ దేవదేవుడే తొలగించాలి. పరమాత్మను మేము ప్రత్యక్షంగా చూసామని ఎవ్వరూ చెప్పలేరు. అలా చెప్పేవారంతా మానసిక సాక్షాత్కారం పొందినవాళ్లే. కాని ముదలాళ్వార్లు ముగ్గురు, పెరియాళ్వార్లు మున్నగువారు ఆ శ్రీమన్నారాయణుని ప్రత్యక్షంగా దర్శించారు. అలాగే మొన్నా, నిన్నా, ఇవాళ మేల్కొన్న గోపికలు ముగ్గురూ భగవదనుభవంలో మునిగి ప్రపంచాన్ని మరచి సుషుప్తిలో ఉండిపోయారు.





తిరుప్పావై --- 11 పాశురం

కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు
శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం
కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం పొఱ్కొడియే
పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు నిన్-
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్-పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ-
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్ ఎన్బావాయ్


రాగం: కేదారగౌళ

వేల లేగదూడల ఆవుల పాలు వేగ పిడికెడువారు
అరుల బలము అణగ పోరు సైపెడువారు
దోషమించుక లేని గోప వంశస్వర్ణలతా!
పుట్టలోని పాము బోలు కటికల వనమయూరీ!
రావే! వయ్యారీ! రావే! శ్రీమంతురాలా! //లేగదూడల//
చుట్టాలు చెలులూ అందరు నీ ముంగిట నిలచీ
నీలమేఘ శ్యామ సుందరుని కీర్తింప
ఉలుకవు పలుకవు నీ నిద్రకర్ధమేమి?!
చెలియరో చెప్పవే - వేగ మేల్కొనవె
జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము..

No comments:

Post a Comment