Wednesday, December 25, 2013

Tulasi Stotram


Tulasi Shodasanamani


Tulasi Kavacham


శ్లోకము: అహింసా ప్రథమం పుష్పం, పుష్ప మింద్రియ నిగ్రహః
సర్వ భూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః
శాంతి:పుష్పం, తపః పుష్పం, ధ్యానం పుష్పం తధైవచ
సత్యమష్ట విధం పుష్పం విష్ణో:ప్రీతికరం భవేత్ .

భావము:-
అహింస, ఇంద్రియ నిగ్రహము, సర్వ భూత దయ, ఓర్పు, శాంతి, పరమాత్మకై తపించుట, పరమాత్మ ధ్యానము సత్యనిరతి అనే ఎనిమిది విధాలైన పుష్పాలతో శ్రీహరిని ఆరాధిస్తే అనుగ్రహిస్తాడని విశ్వాసం.

శ్రీహరి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు, పునస్కారాలకంటే పై ఎనిమిది రకాలైన పుష్పాలతో పూజించడం ద్వారా సకల సంతోషాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.
 — 

తిరుప్పావై --- 7 పాశురం

కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు
వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్
ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్.

కీశూకీశు మనుచు ఏటిరింతలు కలసి
ఊసులాడెనదె! వినలేదా వెర్రిదానా!
కాసుల పేరుల, కొప్పుల ఘుమఘుమలు
కవ్వముల చిలుకు పెరుగు సవ్వడి వినలేదా //కీశుకీశు//
గోపికా నాయకీ! నారాయణుని మూర్తి
కేశవుని నామములు పాడగా వింటివా? పరుంటివా?
తేజోవతీ లేచి తెరువవే తలుపు
జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము.

నిన్న ఒక గోపికను మేల్కొల్పడంలో శ్రీవ్రతం మొదలైంది కదా. ఈరోజు శ్రవణము లో వైవిధ్యమును వివరిస్తూ ఇంకో గోపికను నిద్ర మేల్కొల్పుతున్నారు. వేదపఠనము, శుభకార్యము మొదలుపెట్టేటప్పుడు శ్రీ గురుభ్యోనమః, హరిః, ఓమ్ అని ప్రారంభిస్తారు. నిన్న పక్షుల శబ్దములు, శంఖనాదము, హరి హరీ అనే ధ్వనులు వినలేదా అని గోపికను అడిగారు. దీనివలన గురువును, హరిని తలుచుకున్నట్టుగా భావించాలి. ఈ పాశురంలో భగవన్నామ శ్రవణంలో గల ప్రాముఖ్యాన్ని వివరిస్తున్నారు. భరద్వాజ పక్షులు తెల్లవారుఝామునే లేచి అన్ని వైపులలో ఉన్న పక్షులను కలుపుకుని మాట్లాడుతున్నాయి. ఆ ధ్వని నీకు వినపడలేదా? ఓసి పిచ్చిదానా! పువ్వులు ముడిచిన కొప్పులు విడిపోగా పరిమళాలు వెదజల్లుతున్న గొల్లభామలు కవ్వముతో పెరుగు చిలుకుతుంటే వారి గాజుల గలగలలు, వారి మెడలోని ఆభరణాల ధ్వని, మంగళసూత్రముల చప్పుడు, వారు చిలుకుతున్న పెరుగు సవ్వడి నీకు వినపడలేదా? ఓ నాయకురాలా! ప్రపంచమంతా తన ప్రేమ వాత్సల్యాలతో వ్యాపించియున్న పరమాతం మనకు కనపడాలనే మానవదేహాన్ని ధరించి శ్రీకృష్ణుడై అవతరించాడు. లోకకంటకులైనవారిని సంహరించిన ఆ స్వామిని మేము పెద్దగా కీర్తిస్తుంటే కూడా నీకు వినపడలేదా? విని కూడా మేల్కొనడంలేదా? నీ తేజస్సు మాకు అగుపిస్తున్నది. లేచి ఇకనైనా తలుపు తెరువుము అని మేల్కొలుపుతున్నారు ...


భరద్వాజ పక్షులు మామూలు పక్షులు కావు. వాటి మాటలు మామూలు మాటలు కావు. ప్రయాణానికి పోయేవాళ్ళు త్రోవలో తినడానికి మూటకట్టుకున్నట్లు ఈ పక్షులు ఉదయాన్నే లేచి పగలంతా కలిగే ఎడబాటులో తమకు తోడుగా ఉండడానికి, గుర్తుచేసుకోవడానికా అన్నట్టు ముచ్చట్లాడుతున్నాయి. ఆ మాటల ధ్వని వినపడలేదా అని గోదాదేవి అడుగుతుంది. వ్రేపల్లెలో గోపికలకు పెరుగు చిలకడం అనేది నిత్యకృత్యం. ఎంతటివారైనా తమ నిత్యకృత్యములను ఎప్పుడూ మరచిపోరాడు. వీడరాదు. చల్ల చేసేటప్పుడు పాటలు పాడుకుంటూ తన్మయులై ఉన్న గోపికల కొప్పులు ఊడిపోయి పూవులు జారిపోయి వాటి పరిమళాలు వ్యాపించాయి. వారి ఆభరణాలు, చేతి గాజులు గల్లుగల్లుమంటూ చప్పుడు చేస్తున్నాయి. అమృతాన్ని సాధించడానికి ఆనాడు దేవతలు, రాక్షసులు చేసిన క్షీరసాగరమధనం లాంటిదే ఈ గోపికల నిత్యకృత్యం. మనము మధించే క్షీరసాగరం ఆ పరమాత్మ.అందలి పాలు ఆ దేవుని రూపం, గుణగణాలు. వానిని మననం చేయడమే మధించుట. దానికోసం ఆ దేవునిపై నిలిపిన పట్టుదల మంధరపర్వతం. దానికి కట్టిన తాడే మన శ్రద్ధ, ఇష్టము. ఈ మధనంలో జరిగే పోరాటంలో దైవశక్తులు జయించి మనకు భగవతుని సాన్నిధ్యం లభిస్తుంది.

నిన్నటి పాశురంలో, ఈ పాశురంలో ఎక్కువగా వినడం గురించి ప్రస్తావించారు. ఈ రెండు పాశురాలు ఆధ్యాత్మిక సాధనకు ప్రధమ సోపానమైన శ్రవణం యొక్క ప్రాధాన్యతను వివరిస్తున్నాయి. ఇందులో మనకు చెప్పినవి పక్షుల కలకలం, భరద్వాజ పక్షుల మాటలు. ఈ రెండూ వేదశాస్త్రాలను వినడం గురించి ప్రస్తావిస్తున్నాయి. రెండోది దేవాలయంలో మ్రోగించు శంఖద్వని, పెరుగు చిలికే గోఫికల గాజులు, నగలు, పెరుగు సవ్వడి . వారు కనపడకున్నా ఈ శబ్దాలను బట్టి ఊహించుకోవడమన్నమాట. మూడవది మునులు, యోగులు గానం చేస్తున్న హరీహరీ అనే శబ్దం. ఇది ఆచార్యోపదేశము వంటిది.. అన్నీ ముఖ్యమైనవే. వీరు ఆ గోపికను పిచ్చిపిల్లా, నాయకురాలా! తేజశ్సాలినీ! అని మూడు విధాల పిలిచారు. భగవంతుని అనుగ్రహం కల్గి బ్రహ్మ తేజస్సు నీలో కనిపిస్తుండగా లేదనడం తగినపని కాదు... ఆ అనుభవం నీవు ఒక్కదానివే అనుభావిస్తున్నావు అలా తగదమ్మా!ఏమమ్మా నీకు పిచ్చా అని వీరడుగుతున్నారు. ఇలా చెప్పుకుంటూ రెండవ గోపికను నిద్రలేపి ముందుకు సాగారు






తిరుప్పావై --- 8 పాశురం

కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు

మెయ్యాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం

పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు ఉన్నై -

క్కూవువాన్ వందు నిన్ఱోం కోదుగలం ఉడైయ

పాపాయ్! ఎళుందిరాయ్ పాడి ప్పఱై కొండు

మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ

దేవాది దేవనై చ్చెన్ఱు నాం శేవిత్తాల్

ఆవా ఎన్ఱారాయుందరుళ్-ఏలోర్ ఎంబావాయ్

రాగం: చక్రవాకం

తూరుపు తెలవారె నెచ్చెలీ మేలుకో!

ఎనుములు చిరుబీడుకు మేయగా ఏగెనే

బాలికలందరు అదే పోతగా పోతుంటే

ఆపి, నిను పిలువగా వచ్చి నిలచి నామమ్ము // తూరుపు //

శ్రీకృష్ణు కీర్తించి పరవాద్యమును పొంద

కేశినోటిని చీల్చి, మల్లుర నణచిన

దేవదేవుని చేరి సేవించి నిలువగా

అయ్యో! మీరే వచ్చిరా అనుచు కటాక్షించు..

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.

ఈరోజు నిద్రలేపబోయే గోపిక కృష్ణుడికి కూడా ఆసక్తి కలిగించే విలాసవతి. కృష్ణుడి దగ్గరకు నేనెందుకు వెళ్లాలి? అతటే నా దగ్గరకు రావాలి అనే ధీమాతో పడుకుని ఉంది. పరమాత్మ మీద అంత అచంచలమైన విశ్వాసం ఉన్న ఆమె తమ తోడు లేకుంటే ఈ వ్రతం ముందుకు సాగదని తెలిసిన గోపికలు ఆమెను మేల్కొల్పుతున్నారు.

తూరుపు దిక్కున తెల్లని కాంతి వ్యాపిస్తుంది. మేతకు విడిచిన గేదెలు అన్ని దిక్కులకు వెళ్ళనారంభించాయి. మనతోటి పిల్లలు వ్రతస్థలానికి వెళ్లాలని బయలుదేరారు. శ్రీకృష్ణునివద్దకు వెళ్ళడం చాలా ముఖ్యమని భావించి వారందరూ అలా వెళ్తున్నారు. అలా వెళ్ళెవారిని నిలిపి మరీ నిన్ను పిలవడానికి నీ గుమ్మం ముందు నిలబడ్డాం. కుతూహలంగల ఓ పిల్లా తొందరగా నిద్ర లేచిరా!!. ఆ కృష్ణుని గుణగానము చేసి వ్రతానికి చాలా అవసరమైన పర అనే సాధనాన్ని సంపాదించి, కేశి అనే రాక్షసుని సంహరించి, చాణూర ముష్టికులనే మల్లయోధులను చంపిన ఆ భగవంతుని సమీపించి సేవించినపుడు అతడు మెచ్చుకుని "అయ్యో! మీరే వచ్చారా " అని బాధపడి మనను పరిశీలించి మన కోరికను నెరవేరుస్తాడు. కనుక వెంటనే లేచి రా" అని ఆ గోపికను మేల్కొలుపుతున్నారు.
సూర్యోదయానికి ముందు తూరుపు తెల్లబడటం అనగా మనలో సత్వగుణము ప్రభవించి, రాజస తామస భావాలు తగ్గడం. అదే జ్ఞానోదయానికి ముందు కలిగే మానసిక పశాంతత. భక్తులందరూ సాధారణంగా భగవంతుడిని మేల్కొలుపుతారు. కాని గోదాదేవి మాత్రం భగవంతుని ప్రియ భక్తులను మేల్కొలుపుతుంది. శ్రీకృష్ణుడు కేశి అనే రాక్షసుని చంపాడని కీర్తిస్తున్నారు. ఈ కేశి అనేది అహంకారము. మనలోని అహంకారం, మమకారాలను పట్టి చీల్చవలసింది ఆ పరమాత్మే కదా.. అదే విధంగా మనలోని కామ క్రోధాలనే మల్లురను కూడా ఆ దేవదేవుడే తొలగించాలి. పరమాత్మను మేము ప్రత్యక్షంగా చూసామని ఎవ్వరూ చెప్పలేరు. అలా చెప్పేవారంతా మానసిక సాక్షాత్కారం పొందినవాళ్లే. కాని ముదలాళ్వార్లు ముగ్గురు, పెరియాళ్వార్లు మున్నగువారు ఆ శ్రీమన్నారాయణుని ప్రత్యక్షంగా దర్శించారు. అలాగే మొన్నా, నిన్నా, ఇవాళ మేల్కొన్న గోపికలు ముగ్గురూ భగవదనుభవంలో మునిగి ప్రపంచాన్ని మరచి సుషుప్తిలో ఉండిపోయారు.





తిరుప్పావై --- 11 పాశురం

కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు
శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం
కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం పొఱ్కొడియే
పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు నిన్-
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్-పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ-
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్ ఎన్బావాయ్


రాగం: కేదారగౌళ

వేల లేగదూడల ఆవుల పాలు వేగ పిడికెడువారు
అరుల బలము అణగ పోరు సైపెడువారు
దోషమించుక లేని గోప వంశస్వర్ణలతా!
పుట్టలోని పాము బోలు కటికల వనమయూరీ!
రావే! వయ్యారీ! రావే! శ్రీమంతురాలా! //లేగదూడల//
చుట్టాలు చెలులూ అందరు నీ ముంగిట నిలచీ
నీలమేఘ శ్యామ సుందరుని కీర్తింప
ఉలుకవు పలుకవు నీ నిద్రకర్ధమేమి?!
చెలియరో చెప్పవే - వేగ మేల్కొనవె
జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము..

Friday, July 19, 2013

ద్వారకా తిరుమల :

దీనినే " చిన్న తిరుపతి " అని కూడా అంటుంటారు.ఇక్కడ శేషాద్రి కొండపై శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు దీరియున్నారు. ఇది ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చాలా ప్రసిద్ది చెందిన దేవాలయము. స్వయంభువుగా ప్రత్యక్షమైన వేంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశమునకు ద్వారక తిరుమల అని పేరు వచ్చినది. సుదర్శన క్షేత్రమైన ద్వారక తిరుమల చిన్నతిరుపతిగా ప్రసిద్ది చెందినది. ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట. కనుక ఆ మునికి ప్రత్యక్షమైన స్వామి దక్షిణాభిముఖుడై యున్నాడు.

"పెద్దతిరుపతి" (తిరుమల తిరుపతి)లో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును "చిన్నతిరుపతి"లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుంది. కాని చిన్నతిరుపతిలో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని స్థానికంగా భక్తుల నమ్మకం. ఒకే విమాన శిఖరము క్రింద రెండు విగ్రహములు ఉండటము ఇక్కడి విశేషము. ఒక విగ్రహము సంపూర్ణమైనది. రెండవది స్వామియొక్క పై భాగము మాత్రమే కనుపించు అర్ధ విగ్రహము.

Visheshalu :

1. శేషాచలము, అనంతగిరి అని పిలువబడే ఈ ద్వారకా తిరుమల క్షేత్ర మహత్యం బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది.

2 .మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉడడం కూడా అరుదు.

3 .ఒకే గోపురం కింద రెండు విగ్రహాలు ఉండటం ఇక్కడి విశేషం. స్వామి అసలు విగ్రహం వక్షస్థలం వరకు మాత్రమే కనిపిస్తుంది. మిగతా భాగం కొండలోనే నిక్షిప్తమై ఉంది.
స్వామి వెనుక భాగంలో ఉండే పూర్తి విగ్రహాన్ని (రెండోది) పదకొండో శతాబ్దంలో శ్రీమద్రామానుజుల వారు ప్రతిష్ఠించారు.

4. పెద్దతిరుపతి" (తిరుమల తిరుపతి)లో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును "చిన్నతిరుపతి"లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుంది. కాని చిన్నతిరుపతిలో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని భక్తుల నమ్మకం.

5 .ఇక్కడ స్వామి వారికి అభిషేకము చేయక పోవడము ఇంకొక విశేషము. ఒక చిన్న నీటి బొట్టు పడినా అది స్వామి విగ్రహము క్రిందనున్న ఎర్రచీమలను కదుల్చును. ఆ పుట్టలో స్వామి వున్నట్లున్న పాద ముద్రికలు ఇప్పటికి కనబడుతున్నాయట.

6. ఇక్కడ ఒక కుంకుడు చెట్టుంది. ఈ చెట్టు మీద గరుడ పక్షి కొన్ని సమయాల్లో వచ్చి వ్రాలుతుందట. ఆనాడు శ్రీవేంకటేశుడు తిరుపతి నుండి ద్వారకా తిరుమలకి వస్తారని ప్రతీతి.
ఇక్కడ దొరికే ప్రతిశిల యందు సుదర్శన ముద్ర కన్పిస్తుంది. ఇది చాలా గొప్ప విశేషమయిన సంగతి.

7. ఆలయ సింహద్వారములు వేసినా, మబ్బుపట్టి చీకట్లు కమ్ముకొన్నా ఆలయగోపురము నుండి ఒక దివ్యమైన జ్యోతి దర్శనమిస్తుంది. దగ్గర నుంచి అయితే చిన్న దీపంగాను 200 మీటర్ల దూరం నుంచి చూస్తే పెద్ద వెలుగుగాను చూడవచ్చు

స్థల పురాణము ప్రకారము ఈ క్షేత్రము రాముని తండ్రి దశరథ మహారాజు కాలము నాటిదని భావిస్తారు. "ద్వారకుడు" అనే ఋషి తపసు చేసి స్వామివారి పాదసేవను కోరాడు. కనుక పాదములు పూజించే భాగ్యం అతనికి దక్కింది. పైభాగము మాత్రమే మనకు దర్శనమిస్తుంది. విశిష్టాద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించినారనీ, అందరూ స్వామి పాదపూజ చేసుకొనే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త ధృవమూర్తికి వెనుకవైపు పీఠంపై వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్టించారని అంటారు. స్వయంభువుగా వెలసిన, అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే, ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందనీ, తరువాత ప్రతిష్టింపబడిన పూర్తిగా కనుపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్ధకామ పురుషార్ధములు సమకూరుతాయనీ భక్తుల విశ్వాసం.

ప్రతియేటా రెండు కళ్యానోత్సవములు వైశాఖ మరియు ఆశ్వయిజ మాసములలో జరుపుతారు. ఇందుకు కారణం- స్వయంభూమూర్తి వైశాఖమాసంలో దర్శనమిచ్చారనీ, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజంలో ప్రతిష్టించారనీ చెబుతారు.

గర్భగుడిలో స్వయంభూ వేంకటేశ్వర స్వామి, ప్రతిష్టింపబడిన వేంకటేశ్వరస్వామి ప్రతిమలు కన్నులపండువుగా దర్శనమిస్తాయి. ఆ ప్రక్కనే కుడివైపు అర్ధ మంటపంలో తూర్పు ముఖంగా మంగతాయారు, అండాళ్ (శ్రీదేవి, భూదేవి) అమ్మవార్లు కొలువై ఉన్నారు. శుక్రవారం అమ్మవార్లకు విశేష కుంకుమపూజ చేస్తారు.

కొండపైన ప్రధానాలయానికి నాయువ్య దిశలో కొద్దిదూరంలోనే కొండమల్లేశ్వరస్వామి, భ్రమరాంబికల ఆలయం ఉంది. భ్రమరాంబా మల్లేశ్వరస్వామి ఈ ద్వారకా తిరుమల క్షేత్రానికి క్షేత్ర పాలకుడు. మొత్తం కొండ సర్పరాజు అనంతుని ఆకారంలో ఉన్నదనీ, తలపైన శివుడు, తోక పైన విష్ణువు కొలువు తీరారనీ చెబుతారు. ఈ దేవాలయంలో గణపతి, భ్రమరాంబ, మల్లేశ్వరస్వామి కొలువుతీరు ఉన్నారు. నవగ్రహ మందిరం కూడా ఉంది. ఆలయం తూర్పున "శివోద్యానం" అనే పూలతోట ఉంది.

ఆలయం కొండకు 1 కి.మీ. దూరంలో "కుంకుళ్ళమ్మ" ఆలయం ఉంది. ఈమె ఈ వూరి గ్రామదేవత. ప్రధాన ఆలయంలో స్వామి దర్శనం చేసుకొన్న భక్తులు తిరిగి వెళుతూ కుంకుళ్ళమ్మ దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. ఈ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు.

Thursday, July 18, 2013


శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం ( అన్నవరం )

అన్నవరం ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలానికి చెందిన గ్రామము. అన్నవరం కలకత్తా - మద్రాసు జాతీయ రహదారి పై రాజమండ్రి నుండి దాదాపుగా 70 కి.మీ, కాకినాడ కి 45 కి.మి. దూరంలో ఉంది. ఈ గ్రామంలోని అన్నవరం రైల్వే స్టేషన్ విశాఖపట్టణం-విజయవాడ రైలుమార్గంలో వస్తుంది.

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ కొలువైన త్రిమూర్తి నిలయం అన్నవరం. ఈ ఆలయం రెండు అంతస్థులలో నిర్మింపబడింది. క్రింది భాగంలో యంత్రం, పై అంతస్థులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంది. క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణు మూర్తి గా అర్చిస్తారు, మధ్యభాగంలో ఉన్నదానిని శివునిగా పూజిస్తారు. మూలవిరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింప బడడం ఇక్కడి విశేషం. త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉన్నది. అలా త్రిమూర్తులు వెలసిన ఈ అరుదైన ఆలయానికి యుగాల చరిత్ర ఉందంటారు భక్తులు.

శ్రీ సత్యనారాయణ స్వామివారిని ఈ క్రింది విధంగా స్తుతిస్తారు.

మూలతో బ్రహ్మరూపాయ
మధ్యతశ్చ మహేశ్వరం
అధతో విష్ణురూపాయ
త్ర్త్యెక్య రూపాయతేనమః


స్థలపురాణం:

పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందారు. వారు రత్నాకరుడు, భద్రుడు. వీరు పరమ విష్ణు భక్తులు. వారు హరిని తమ శిరస్సున దాల్చాలన్న కోరికతో తపస్సు చేసారు. వారి కోరిక మేరకు నారాయణుడు భద్రుని శిరస్సుపై (భద్రాచలం) వైకుంఠ రాముడిగానూ, రత్నాకరుడి (రత్న గిరి)పై సత్యనారాయణుడి గానూ అవతరించారు.

దేవాలయ ప్రాశస్తి:

తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురంకి సమీపంలో గోరస గ్రామ ప్రభువు (గోర్సా, కిర్లంపూడి ఎస్టేట్స్) శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామానారాయణం బహద్దరు రాజా ఐ.వి.రామనారాయణం వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు వీరికీ, శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామానారాయణిం బహద్దరు వారికీ ఏక కాలంలో కలలో కనపడి "రాబోవు శ్రావణ శుక్ల విదియా మఖా నక్షత్రములో గురువారము నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను. నీవు నన్ను శాస్త్రనియమానుసారము ప్రతిష్టించి సేవించుము" అని చెప్పి మాయమయ్యారు.

మరునాడు ఇరువురు కలసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరు అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామి వారి పాదముల మీద సూర్యకిరణములు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి, స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండ పైకి తీసుకొని పోయి, కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణుపంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891, ఆగష్టు 6 వ తేదీన (శాలివాహన శకం 1813) ప్రతిష్టించారు.

ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి, నాలుగు దిక్కులలో నాలుగు చక్రాలతో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునక. వనదుర్గ ఆలయం, రామాలయాలు ప్రక్కన కనిపిస్తూ ఉంటాయి. ఆలయ రూపం, అగ్ని పురాణంలో చెప్పబడినట్లు, ప్రకృతిని తలపిస్తూ ఉండాలి.

పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నములు గలవి, శూల శిఖరములతో ఉన్నవి అయిన రెండు చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్య దేవతా, అంబికా దేవతా ప్రతీకలగు చక్రశిఖరములు ఉన్న మరి రెండు విమాన గోపురాలూ ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధములైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం.

పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉన్నది. ఈ గుడికి పాదచారులు చేరు కోవడానికి 460 మెట్లు ఉన్నాయి.

ప్రతీ ఏటా పదిలక్షల మంది భక్తులు అన్నవరంలో వ్రతమాచరిస్తారని అంచనా.

వీరత్వానికీ, సత్యానికీ ప్రతీకగా భావించే మీసాలరాముడి కల్యాణోత్సవాలను ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి బహుళ పాడ్యమి వరకూ అంగరంగ వైభవంగా జరుపుతారు భక్తులు.

ఇక్కడి ఇంకో విశేషం ప్రసాదం. గోధుమరవ్వతో ఆలయ ప్రసాదశాలలో తయారయ్యే ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బయటి వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ రుచి మాత్రం రాదు.
1. ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో , ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు.

ప్రతీసంవత్సరం ఆషాడ శుద్ధ ఏకాదశిని 'తొలిఏకాదశి' గా అంటారు. ఎందుచేతనంటే! పూర్వకాలమందు ఈ తోలిఏకాదశితోనే, సంవత్సర ప్రారంభంగా కూడ చూచేవారట! ఈ రోజును 'శయన ఏకాదశి' అనికూడా పిలుస్తారు ఎందువల్లననగా; శ్రీమహావిష్ణువు ఆరోజునుండి కార్తీకశుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉంటారని, నాటినుండి శ్రీహరిభక్తులు కామక్రోధాధులు వర్జించి ప్రయాణాలు చేయకుండా ఒకేచోట ఉండి శ్రీహరిని అర్చిస్తూ తిరిగి కార్తీకశుద్ధ ఏకాదశి 'ఉత్థాన ఏకాదశి' వరకు ఆనాలుగు మాసములు చాతుర్మాస్య వ్రతం చేయుట కూడా మన భారతీయ సంప్రదాయములలో ఒకటి. ఆరోజు 'శ్రీహరి' శేషతల్పం పైనుండి మేల్కొంటారు. ఈ చాతుర్మాస్య దీక్షను సన్యాసులు మాత్రమేకాదు. సంసారులు, వయో, లింగబేధము లేకుండా భక్తులందరూ దీనిని ఆచరిస్తూ ఉంటారు.

ఈ 'తొలి ఏకాదశి' నాడు "గోపద్మ వ్రతం" చేయుట ఎంతో విశిష్టమైనదిగా చెప్తారు.

ఈ గోమాత పూర్తిగా విరాట్ పురుషుని రూపంతో పోల్చబడింది. గోవునకు ముఖమునందు వేదాలు, కొమ్మలయందు హరిహరులు, కొమ్ముల చివర ఇంద్రుడు, లలాటమున ఈశ్వరుడు, కర్ణములందు అశ్వనీదేవతలు నేత్రములందు సూర్యచంద్రులు, దంతములయందు గరుడుడు, జిహ్వయందు సరస్వతి, ఉదరమునందు స్కందుడు, రోమకూపములందు ఋషులు, పూర్వభాగమునందు యముడు, పశ్చిమ భాగమునందు అగ్ని, దక్షిణభాగమున వరుణ కుబేరులు, వామభాగము నందు యక్షులు, ముఖమునందు గంధర్వులు, నాసాగ్రమందు పన్నగలు, అపానంబున సరస్వతి, గంగాతీర్థంబులు, గోమయంబున లక్ష్మీ, పాదాగ్రంబున ఖేచరులును, అంబా అంటూ అరచే అరుపులో ప్రజాపతి, స్థనములందు చతుస్సాగరములు ఉన్నట్లుగా వర్ణింపబడెను. కావున గోవును పూజిస్తే! సమస్త దేవతలను పూజించి నట్లేనని, సమస్త తీర్థములలో పుణ్యస్నానంచేసిన పుణ్యఫలం లభిస్తుందని 'గోమాతకు' ఇంత పూజ్యస్తానమిస్తూ, అధర్వణ వేదంలో బ్రహ్మాండపురాణంలో, మాహాభారతంలో, పద్మపురాణంలో ఇలా ఎన్నో గాధలు ఉన్నాయి.

అట్టి గోమాత నివశించే గోశాలను ఈ 'తొలిఏకాదశి' దినమందు మరింతగా శుభ్రముచేసి అలికి ముత్యాల ముగ్గులతో రంగవల్లికలను తీర్చిదిద్ది గోశాల మధ్యభాగమందు బియ్యపు పిండితో ముప్పైమూడు పద్మాల ముగ్గులు పెట్టి, శ్రీమహాలక్ష్మీ సమేత శ్రీమహావిష్ణువు ప్రతిమను ఆపద్మములపైనుంచి, వారిని విధివిధానంగా పూజించి, పద్మానికి ఒక్కొక్క "అప్పడాన్ని" వాటిపై ఉంచి ఆ అప్పడాలను వాయనాలను, దక్షిణ తాంబూలాదులలో బ్రాహ్మణుని సంతుష్టుని గావించి, గోమాతను పూజించువార్కి సకలలాభీష్టములు తప్పక నెరవేరుతాయని చెప్పబడినది. అలా, గోపద్మవ్రతం చెయ్యాలి.

ఇంత పుణ్యప్రదమైన తొలిఏకాదశి పర్వదినం శుభప్రదముగా జరుపుకుని పునీతులౌదాము
----------------------------------------------------------------------------------
2.ఆషాఢ శుక్ల ఏకాదశి/శయన ఏకాదశి :

ఒక సంవత్సరములో మనకు 24 ఎకాదశులు వచ్చును అందులో ముఖ్యమైనది శయన ఏకాదశి, పరివర్తన ఏకాదశి మరియు ఉత్థాన ఏకాదశి బహు విశిష్టమైనది మిగత యెకాదశులలో ఉపవాసము ఉండలేక పోయినా ఈ మూడు ఎకాదశులలో ఉపవాసము వుంది మహాలక్ష్మీ సహిత మహావిష్ణుని పూజించిన 24 ఏకాదశులలో ఉపవాసము ఉన్న ఫలితము దక్కును
శయన ఏకాదశి రోజు దంపతులు ప్రొద్దున ఉపవాసము ఉండి సాయంకాలము సూర్య అస్తమనం అయిన తర్వాత సంధ్యావందనం కానిచ్చి పూజ మందిరములో పట్టు వస్త్రము పరచి దానిపైన మహాలక్ష్మీ సమేత మహావిష్ణు పటమును వుంచి మల్లెలు తామార పువ్వులతో అష్టోత్తర శతనామములతో పూజించి పాల అన్నము నివేదన చేసి నమస్కరించి విష్ణు సహస్ర నామము జపించి రాత్రి ఈ క్రింది స్లోకముతో నమస్కరించ వలెను

***వాసుదేవ జగద్యోనే ప్రాప్తేయం ద్వాదశి తవ భుజంగ సయనేబ్దౌ చ సుఖం స్వపిహి మాధవ
ఇయం తు ద్వాదశి దేవా శయనార్థం వినిర్మితా అస్యాం సుప్తే జగన్నాథ జగత్ సుప్తం భవేదిడం విబుద్దే త్వయి భుధ్యేత్ సర్వమేతత్ చరాచరం

ఫలితం : దీనివల్ల మనము శయనిన్చుటకు మంచి గృహము మంచి పడుకయు మరియు పండుకోనగానే సుఖమైన నిద్ర లభించును
----------------------------------------------------------------------------------
3.
లక్ష్యమును నిరవేర్చు లక్ష ప్రదక్షిణ వ్రతము 19 07 2013 to 13.11.2013
దైవారాధన విధానములో బహు సులభమైన మార్గము దేవతలను ప్రదక్షిణము చేయుటయే ఆషాఢ సుద్ద ద్వాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి అనగా 13.11.2013 వరకు ఆలయములలోనో లేక అశ్వథ వ్రుక్షమునో లేక పశువునో లక్ష మారులు ప్రదక్షిణము చేయవలెను వీలుకాని యెడల తక్కువ పక్షము వేయి మార్లైనను తప్పకుండ ప్రదక్షిణము చేయవలెను అప్పుడు చెప్పవలసిన శ్లోకములు

**విష్ణువునకు: అనంత మవ్యయం విష్ణుం లక్షిమి నారాయణం హరిం జగదీశా నమస్తుభ్యం ప్రదక్షిణ పదే పదే

**హనుమకు: రామదూత మహావీర రుద్ర బీజ సముద్భవ అంజనా గర్భ సంభూత వాయుపుత్ర నమోస్తుతే

**గోవుకు : గవాం అన్గేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం మే స్యాత్ ఇహ లోకే పరత్రచ

ఈ ప్రదక్షిణముల వలన మన పాప రాశి అంతయు దగ్ధమై మన జీవితం ప్రశాంతముగా ఉండును.

Tuesday, July 9, 2013

July 15 2013 నుండి ఉత్తరాయణం వెళ్లి దక్షిణాయణం ప్రారంభం అవుతుంది!

అసలు ఉత్తరాయణం, దక్షిణాయణం అంటే ఏంటి?
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అప్పటి నుండి ప్రారంభం అవుతుంది ఉత్తరాయణం! దీన్ని మనం చాల తేలికగా కనిపెట్టవచ్చు! సూర్యుడు ఉత్తరం వైపు నుండి ఉదయిస్తాడు! అంటే తూర్పు వైపు మీరు నుంచుంటే ఎండ వల్ల మీ నీడ మీ కుడివైపు పడుతుంది! గమనించండి!
సూర్యుడు కర్కాటక రాశి లో ప్రవేసిస్తాడు! దక్షిణాయణం అంటే దక్షిణం వైపునుండి ఉదయిస్తాడు! ఇప్పుడు మీ నీడ ఎడమ వైపు పడుతుంది! ఇది దక్షిణాయణం!
ఈ దక్షిణాయనం లో దేవతలు నిద్రిస్తారు! ఆ సమయంలో మనకి పండగలు ఎక్కువగా వస్తాయి ఎందుకంటే మనం చేసే పూజలు దేవతలకి శక్తులు ఇస్తాయి (మనం అలసిపోయి పడుకుంటే విశ్వ శక్తి మనలో ప్రవేశించి ఎంత శక్తిని ఇస్తుందో మనం చేసే పూజలు వారికీ అలా శక్తిని ఇస్తాయి)! ఉత్తరాయణంలో దేవతలు మేల్కొంటారు! ఆ సమయంలో దేవతలు మనకి అన్ని విధాలుగా ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారు!
మన సంవత్సరం దేవతలకిఒక్క రోజు! ఉత్తరాయణం పగలు! దక్షిణాయనం రాత్రి!

శ్రీ జగన్నాధ స్వామి రధయాత్ర - July 10th 2013

ఆషాఢ శుద్ధ విదియ నాడు మోక్ష క్షెత్రమైన "పూరీ" లో జగన్నాధ బలభద్ర సుభద్ర రధయాత్ర అత్యంత వైభవం గా జరుగుతుంది.
జగత్ప్రసిద్ధమైన ఈ రధయాత్ర పరమ పావనం.
"రధస్థం వామనం ద్రుష్ట్వా పునర్జన్మ న విద్యతే " -- రధాన్న ఉన్న వామనుని చుసిన వారికి పునర్జన్మ ఉందడు .
ఈ రోజునే శ్రీ రాముని రథోత్సవం అని ధర్మశాస్త్ర వచనం !
విష్ణువునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఇది .
హరె రామ హరె రామ రామ రామ హరె హరె
హరె కృష్ణ హరె కృష్ణ కృష్ణ కృష్ణ హరె హరె !
శ్రీ జగన్నాధ స్వామి రధయాత్ర - July 10th 2013 ఆషాఢ శుద్ధ విదియ నాడు మోక్ష క్షెత్రమైన "పూరీ" లో జగన్నాధ బలభద్ర సుభద్ర రధయాత్ర అత్యంత వైభవం గా జరుగుతుంది. జగత్ప్రసిద్ధమైన ఈ రధయాత్ర పరమ పావనం. "రధస్థం వామనం ద్రుష్ట్వా పునర్జన్మ న విద్యతే " -- రధాన్న ఉన్న వామనుని చుసిన వారికి పునర్జన్మ ఉందడు . ఈ రోజునే శ్రీ రాముని రథోత్సవం అని ధర్మశాస్త్ర వచనం ! విష్ణువునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఇది . హరె రామ హరె రామ రామ రామ హరె హరె హరె కృష్ణ హరె కృష్ణ కృష్ణ కృష్ణ హరె హరె !
అష్టాదశ పురాణాలు


1. మత్స్య పురాణం : మత్స్యావతారమెత్తిన శ్రీ మహావిష్ణువు మనువుకు బోధించిన పురాణం ఇది. యయాతి, సావిత్రి, కార్తికేయ చరిత్రలు ఇందులో ఉన్నాయి. అంతేకాక వారణాసి, ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాల వివరణ ఇందులో ఉంది.

2. మార్కండేయ పురాణం : ఇది మార్కండేయ ఋషి చెప్పినది కనుక దీనికి ఈ పేరు వచ్చింది. శివుడు, విష్ణువు, ఇంద్రుడు, అగ్నిదేవుడు, సూర్యుల మహత్తు గురించి ఇందులో వివరించారు.

3. భాగవత పురాణం : దీన్ని తెలుగులోకి పోతన కవి అనువదించారు కనుక తెలుగు ప్రజలకు ఇది చిరపరిచితమైన పురాణమే. ఇందులో మహావిష్ణు అవతారాల గురించి , శ్రీకృష్ణుని లీలల గురించి వివరించారు. తెలుగులో ఇది మొత్తం 12 స్కంధాల గ్రంధం.

4. భవిష్య పురాణం : ఇది సూర్యభగవానుడు మనువుకు చెప్పిన పురాణం. ఇందులో వర్ణాశ్రమాల ధర్మాల అగురించ్, భవిష్యత్తులో జరగబోయే పరిణామాల గురించి వివరించారు.

5. బ్రహ్మ పురాణం : ఇది దక్షునికి బ్రహ్మదేవుడు చెప్పిన పురాణం. శ్రీకృష్ణుడు, మార్కండేయుడు, కశ్యపుల జీవన గాథలు ఉన్నాయి.

6., బ్రహ్మాండ పురాణం : బ్రహ్మ మరీచికి చెప్పిన పురాణం ఇది. పరశురాముడి గురించి, రాముడి గురించి, శ్రీకృష్ణుని గురించి ఇందులో వివరించారు. ఇందులో దేవతాస్తోత్ర శ్లోకాలు కూడా ఉన్నాయి.

7. బ్రహ్మవైవర్త పురాణం : ఇది నారద మహర్షికి సావర్ణుడు చెప్పిన పురాణం. సృష్టికి మూలమైన భౌతిక జగత్తు గురించి, పంచమహా శక్తుల గురించి ఇందులో ఉంది.

8. వరాహ పురాణం : ఇది విష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన పురాణం. పార్వతీ పరమేశ్వర చరిత్ర, ధర్మశాస్త్ర శ్లోకాలు, వ్రత విధానాలు ఇందులో ఉన్నాయి.

9.వామన పురాణం : నారదునికి పులస్త్య ఋషి వివరించిన పురాణం ఇది. శివపార్వతుల కళ్యాణం, కార్తికేయగాధ, భూగోళ వర్ణన, రుతువర్ణన ఇందులో ఉన్నాయి. ఆర్యభట్టులాంటి ఖగోళ శాస్త్రవేత్తలు ఈ పురాణాన్ని శ్రద్ధగా చదివినట్లు ఆధారాలున్నాయి.

10. వాయు పురాణం : ఇది వాయుదేవుడు ఉపదేశించిన పురాణం. ఇందులో శివమహత్యముతో పాటు భూగోళ వర్ణన, సౌరమండల వ్యవస్థ వర్ణన కూడా ఉండి. మన ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తలు ఈ పురాణాన్ని కూడా అధ్యయనం చేశారు.

11. విష్ణు పురాణం : ఇది మైత్రేయునికి పరాశర మహర్షి ఉపదేశించిన పురాణం. విష్ణు, శ్రీకృష్ణ, ధృవ, ప్రహ్లాద, భరతుల గురించి విపులంగా వివరించారు.

12. నారద పురాణం : ఇది నారదుడు నలుగురు బ్రహ్మ మానసపుత్రులకు చెప్పిన పురాణం. ఇందులో వ్రతాల గురించి, వేదాంగాల గురించి కూడా వివరించారు. వివిధ పుణ్యక్షేత్రాల వర్ణన ఇందులో ఉంది.

13. అగ్ని పురాణం : ఇది అగ్నిదేవుడు ప్రవచించిన పురాణం. వైద్యం, వ్యాకరణం, చందస్సు, భూగోళ శాస్త్రం, జ్యోతిష్యం గురించి ఇందులో ఉన్నాయి.

14. స్కంద పురాణం : ఇది స్కందుడు చెప్పిన పురాణం. ఇందులో అనేక వ్రతాల గురించి, శివమాహత్మ్యం గురించి ఇంకా వివిధ పుణ్యక్షేత్రాల గురించి వివరించారు.

15. గరుడ పురాణం : ఇది తన వాహనమైన గరుడునికి (గరుత్మంతునికి) శ్రీమహావిష్ణువు ఉపదేశించిన పురాణం. గరుడుని జన్మవృత్తాంతముతో పాటు స్వర్గలోకం గురించి, నరకలోకం గురించి, విష్ణు ఉపాసన గురించి ఇందులో వివరించారు.

16. లింగ పురాణం : ఇందులో శివుని ఉపదేశాలు, ఇతర వ్రతాలు, ఖగోళశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం మొదలైన వాటి గురించి వివరించారు.

17. కూర్మ పురాణం : శ్రీమహావిష్ణువు కూర్మావతారంలో ఉపదేశించిన పురాణం కనుకే దీనికి ఈ పేరు వచ్చింది. ఇందులో వరాహ అవతారం గురించి, నరసింహావతారం గురించి వివరించారు. భూగోళం గురించి కూడా వివరించారు.


18. పద్మ పురాణం : 18 పురాణాలలోకెల్లా ఇది పెద్దది. ఇందులో బ్రహ్మ చేసిన సృష్టి గురించి, గంగా మహాత్మ్యం గురించి, గాయత్రీ చరితం గురించి, గీత గురించి, పూజా విధానం గురించి వివరంగా వర్ణించారు.

Friday, July 5, 2013

వివిధ సందర్భాలలో పఠించదగు శ్లోకములు

వివిధ సందర్భాలలో పఠించదగు శ్లోకములు

ఉదయం నిద్ర లేచిన వెంటనే పఠించు ధ్యానము:

బ్రహ్మమురారి త్రిపురాంతకారీ భానుశ్శశిః భూమిసుతో బుధశ్చ
గురుశ్చ శుక్రశ్శని రాహుకేతవః కుర్వంతు సర్వే మమ సుప్రభాతం.

విష్ణుశక్తి సముత్పన్నే చిత్రవర్ణ మహీతలే
అనేకరత్న సంపన్నే పాదఘాత క్షమా భవ.

కరాగ్రే వసతే లక్ష్మీః కర మధ్యే సరస్వతీ
కరమూలేతు గోవిందః ప్రభాతే కర దర్శనం.

సముద్ర వసనే దేవి పర్వత స్తనమండితే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్యమే.

స్నానము చేయునపుడు పఠించవలసినవి:

గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు.

ఆవాహయామి త్వాం దేవి స్నానార్థమిహ సుందరి
ఏహి గంగే నమస్తుభ్యం సర్వతీర్థ సమన్వితే.

పుష్కరాద్యాని తీర్థాని గంగాద్యా సరిత స్తథా
ఆగచ్ఛంతు మహాభాగా స్నానకాలే సదా మమ.

అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతో2పివా
యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశ్శుచిః

పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్ష!

గణపతి ప్రార్ధన:

శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం.
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే.

పార్వతీ పరమేశ్వర ప్రార్థన:

వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే.
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.

గురు ప్రార్థన:

గురు బ్రహ్మ గురు విష్ణుః గురుర్దేవో మహేశ్వరః.
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

ధ్యాన మూలం గురోర్మూర్తిః పూజా మూలం గురోః పదం
మంత్ర మూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా.

సరస్వతీ ప్రార్థన:

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమేసదా.

పద్మ పత్ర విశాలాక్షి పద్మ కేశరవర్ణనీ
నిత్యం పద్మాలయాం దేవి సామాంపాతు
సరస్వతీ భగవతీ భారతీ నిశ్శేషజాడ్యాపహా.

దక్షిణామూర్తి ప్రార్థన:

ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ్ ఙ్ఞానైకమూర్తయే
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణా మూర్తయే నమః.

గురవే సర్వ లోకానాం భిషజే భవరోగిణాం
నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః.

భోజనమునకు ముందు:

శ్లో: బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతం
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా .

శ్లో:అన్న పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ వల్లభే
ఙాన వైరాగ్య సిధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతీ.

శ్లో: అహం వైస్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం.

ఓం నమో నారాయణాయ.

భోజనమునకు తరువాత:

అగస్త్యం కుంభకర్ణం చ శమ్యం చ బడబానలం
ఆహారపరిణామార్థం స్మరామి చ వృకోదరం.

సంధ్యా దీపమునకు:

దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే.

నిద్రకు ఉపక్రమించునపుడు :

అచ్యుతం కేశవం విష్ణుం హరిం సత్యం జనార్దనం
హంసం నారాయణం కృష్ణం జపేద్దుస్వప్న శాంతయే.

రామస్కంధం హనూమంతం వైనతేయం వృకోదరం
శయనేయసి స్మరేన్నిత్యం దుస్వప్నస్తస్య నశ్యతి.

ఇంటి నుండి కార్యార్థులై వెళ్లునపుడు:

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయమంగళం.

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః
యేషామిందీ వరస్యామో హృదయస్థో జనార్దనః.

ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.

ఔషధ సేవనము చేయునపుడు:

ధన్వంత్రిణం గరుత్మంతం ఫణిరాజంచ కౌస్తుభం
అచ్యుతం చామృతం చంద్రం స్మరేదౌషధ కర్మణి.

శరీరే జర్జరీభూతే వ్యాధి గ్రస్తేకళేబరే
ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరిః.

Monday, June 24, 2013

వృత్రాసురుడిని చంపి ఇంద్రుడు బ్రహ్మహత్యాపాపము మూటగట్టుకొనెను.
ఆ దోషము పోగొట్టుకొనుటకు ఇంద్రుడు ఐదు వైష్ణవాలయాలు స్థాపించాడు.

కాశీ లో బిందు మాధవ స్వామి.
ప్రయాగ లో వేణు మాధవ స్వామి.
పిఠాపురంలో కుంతి మాధవ స్వామి.
తిరుచునాపల్లి లో సుందర మాధవ స్వామి.
రామేశ్వరం లో సేతు మాధవ స్వామి.
తిరుమల 7 కొండలు..

1. వృషాద్రి 2. వృషభాద్రి 3. గరుడాద్రి 4. అంజనాద్రి 5. శేషాద్రి 6. వేంకటాద్రి 7. నారాయణాద్రి.

ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది. బ్రహ్మ స్థానం లో ఉంటుంది.

అందుకనే ఆయన 7 కొండలు పైన ఉంటాడు. ఈ 7 కొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంటుంది. ఆ 7 కొండలు సాలగ్రామాలే. ఆ 7 కొండలూ మహర్షులే. అక్కడి చెట్లు, పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశలే. తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదు.

1. వృషభాద్రి - అంటే ఎద్దు. వ్రుశాభానికి ఋగ్వేదం లో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమ శివుడు కూర్చుంటాడు. దానికి 4 కొమ్ములున్టాయ్. 3 పాదాలు (భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు)

వాక్కు అంటే - శబ్దం
శబ్దం అంటే - వేదం
వేదం అంటే - ప్రమాణము

నా కంటితో చూసిందే నిజమంటే కుదరదు. నిజం కానివి చాలా ఉంటాయ్. సుర్యోదయం, సూర్యాస్తమయం అని అంటున్నారు. నిజం గా దాని కన్నా అభద్దం ఉంకోటి లేదు. సూర్యుడికి కదలిక ఏమి ఉండదు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది. భూమి తిరగడం మీరు చూసారా. భూమి సూర్యుడికి అభిముఖంగా వెళ్ళినప్పుడు చీకటి. తిరగనది సూర్యుడు. మీ కన్ను భ్రమకి లోనైట్ట లేదా. కాబట్టి వేదమే ప్రమాణము. వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడు.

2. వృషాద్రి - అంటే ధర్మం

ధర్మం అంటే - నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు. నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం, చూడడం, మంచి వాక్కు etc. దాని వల్ల ఇహం లోను, పరలోకం లోను సుఖాన్ని పొందుతాడు.

అవి చెయ్యడమే వృషాద్రి ని ఎక్కడం.

3. గరుడాద్రి - అంటే పక్షి - ఉపనిషత్తుల జ్ఞా నాన్ని పొందడం.
షడ్ - అంటే జీర్ణం కానిది. ఒక్క పరమాత్మ మాత్రమే జీర్ణం కానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాటికి 6 వికారాలు ఉంటాయి.

పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది.

ఇవ్వన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే ఉంటాయి. ఆ 6 లేని వాడు భగవానుడు.

భ == ఐశ్వర్య బలము, వీర్య తేజస్సు & అంతా తానే బ్రహ్మాండము అయినవాడు.
అన్ == ఉన్నవాడు, కళ్యాణ గుణ సహితుడు, హేయగుణ రహితుడు.

అటువంటి భగవానుణ్ణి జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి.

4. అంజనాద్రి - అంజనం అంటే కంటికి కాటుక.
కాటుక ఎప్పుడు పెట్టుకుంటాం? అందానికి, చలవకి.

కంటికి అందం ఎప్పుడు? - ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినపుడు. ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక. ఇదంతా పరమాత్మ సృష్టియే.

అప్పుడు అంజనాద్రి దాటతాడు.

5. శేషాద్రి - ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూసాడనుకోండి వాడికి రాగ ద్వేషాలు ఉండవు. వాడికి క్రోధం ఉండదు. వాడికి శత్రుత్వం ఉండదు. భగవద్గీత లో గీత చార్యుడు చెప్పాడు,

తుల్య నిందా స్తుతిర్ మౌని (శ్లోకం చెప్పారు)

తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వాడికి భయం. అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు. (ఇక్కడ రమణ మహర్షి కొన్ని ఉదాహరణలు గురుంచి చెప్పారు ) ఎప్పుడూ ఒకేలా ఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడం.

6. వేంకటాద్రి - వేం : పాపం, కట : తీసేయడం. కాబట్టి పాపాలు పోతాయి. అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు, అందుకనే మనకి బ్రహ్మం తెలిసిన వారు పిచ్చి వాళ్ళలా కనవడుతారు అది మన కర్మ. రామ కృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని, పిచ్చి వాడు ఒకలా ఉంటారు.

ఆయనకే అర్పణం అనడం & అటువంటి స్థితి ని పొందడం వెంకటాద్రి ఎక్కడం.

7. నారాయణాద్రి - అంటే తుల్యావస్థ ని కూడా దాటిపోయి, తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారయానాద్రి.

వేంకటాచలం లో 7 కొండలు ఎక్కడం వెనకాల ఇంత నిక్షేపాలను ఉంచారు. ఈ కారణాలు తెలుకుకోవడం 7 కొండలు ఎక్కడం.
శ్రీశైలపూర్నులు అని పిలవబడే తిరుమల నంబి .

ఎంత గొప్ప వారు అంటే, ప్రాచీన కాలం లో స్వామి వారి అభిషేకానికి నీళ్ళు తెచ్చేవాళ్ళు లేనప్పుడు ఆయన మడి కట్టుకుని బ్రాహ్మీ ముహూర్తం లో, కారు చీకటి లో స్వామి వారికి పాప నాశనం నుంచి కుండలో నీళ్ళు తెచ్చేవారు. ఒక రోజు స్వామి వారు ఆయన భక్తిని పరీక్షిద్దామని, అలాగే లోకానికి చాటి చెప్పాలని, ఒక బోయ వాడి రూపంలో వచ్చి తాత తాత దాహం వేస్తోంది కొన్ని నీళ్ళు ఇవ్వా అని అడిగారు. ఈ నీళ్ళు స్వామి వారి అభిషేకానికి పట్టికెళ్ళు తున్నాను, నీకు ఇవ్వను పో అన్నాడు. అప్పుడు ఆ బోయవాడు తిరుమల నంబి వెనక్కి వెళ్లి, బాణంతో కుండని కొట్టాడు. కుండకి చిల్లు పడింది, నీళ్ళు అంతా తాగేసాడు. ఆయన ఎంత పనిచేసావు రా శ్రీనివాసుడికి పట్టికెళ్ళే నీళ్ళని తాగేసావా అని చాల బాధ పడ్డారు. తిరుమల నంది ఆ బోయ పిల్ల వాడిని నిందించబోతోంటే, తాత తాత ఏమి బాధ పడకు అని, నీకు పాప నాశనం కంటే గొప్ప నీరుని చూపిస్తాను. ఇక్కడే ఉంది అని ఒక కొండ గుహ లోకి తీసుకువెళ్ళాడు. అక్కడ బాణ ప్రయోగం చేస్తే ఆకాశ గంగ పుట్టింది. ఇక నుంచి ఈ నీటితో నాకు అభిషేకం చెయ్యి అని అన్నాడు. తిరుమల నంబి ఆశ్చర్యపోయి వెనక్కి చూసేసరికి, ఆ పిల్ల వాడు మాయమైపోయాడు. కాబడి, ప్రతి శుక్రవారం నాడు ఆకాశ గంగ నుంచి తీర్థాన్ని తీసుకెళ్ళి స్వామి వారికి అభిషేకం చేస్తారు. స్వామి వారిచే తాత తాత అని పిలిపించు కున్నాడు కాబట్టి మొదటి నీరాజనం తిరుమల నమ్బికే. స్వామి వారిని మాడ వీధులలో ఊరేగింపుకి తీసుకుని వెళ్ళేటపుడు, స్వామి మొదటి నీరాజనం తిరుమల నంబి దేవాలయం దగ్గరే తీసుకుంటారు. ఈ గుడి సహస్ర దీపాలంకరణ చేసే రోడ్డులో దక్షిణం వైపు ఉంది
అలిపిరి దగ్గర శ్రీవారి పాదాలు ఎలా వచ్చాయి?

తిరుమల నంబి స్వామి వారికి అభిషేకం చేసి, కిందకి దిగి రోజూ రామానుజా చార్యుల వారికి రామాయణం చెప్పేవారు. మళ్లి సాయంత్రం కొండ ఎక్కేవారు. దీని వల్ల స్వామి వారి దర్శనం ప్రొద్దున్న & సాయంత్రం మాత్రమే అవుతోందని బాధ పడేవారు. వేంకటేశ్వర స్వామి వారు ఆయన కలలో కనబడి ఏమని అభయం ఇచ్చారంటే - నా పాదాలని అలిపిరి దగ్గర ఉంచుతాను నువ్వు మధ్యాహ్నం కూడా వచ్చి దర్సనం చేసుకోవచ్చు అని. మనం కొండని కాలి మార్గం గుండా వెళ్ళే ముందు అలిపిరిలో శ్రీవారి పాదములు అని కనిపిస్తాయి. ఆ పాదాలు తిరుమల నంబి గొప్పతనం వల్లనే వచ్చాయి. ఎంతో గొప్ప మహానుభావుడాయన.

వేంకటేశ్వర స్వామి వారికి మొదటి నైవేద్యం కుండలోనే..

ఈశ్వరుడు అంటాడుట "నేను చెప్పినట్టు మీరు నడుచుకోవడమే మీరు నాకు ఇచ్చే పెద్ద దక్షిణ. భగవంతుడు బంగారానికి,వజ్రాలకి పొంగిపోయే ఆయన కాదని చెబుతూ గురువు గారు ఈ కధ చెప్పారు. ఇది వరకు తిరుమలలో "తొండమాన్ చక్రవర్తి" అనే ఆయన స్వామి వారికి రోజూ బంగారు తులసి దళాలు సమర్పించేవాడట. అప్పట్లో స్వామి వారు భక్తులతో మాట్లాడుతూ ఉండేవారు కూడా. ఈ తొండమాన్ చక్రవర్తి రోజూ స్వామి వారి దగ్గరికి వెళ్లి చెబుతూ ఉండేవాడుట - స్వామి నేను మీకు రోజూ బంగారు తులసీదళాలతో పూజ చేస్తున్నాను. పైగా, నాకంటే పెద్ద భక్తుడు మీకు ఎవరున్నారు స్వామి అన్నాడుట. స్వామి వారికి చిరాకు వేసి వీడికి ఒక పాఠం చెప్పాలని, నాకు ప్రియమైన భక్తుడు ఈ ప్రాంతానికి దగ్గర లోనే భీముడు అని ఒక కుమ్మరివాడు ఉంటాడు. వాడిని వెళ్లి చూడు అన్నారుట స్వామి. మరుసటి రోజు వెళదాం అని అనుకుని, స్వామి వారి పాదాల క్రింద ఉన్న తులసి దళాలని శుభ్రం చేస్తున్నాడుట. అప్పుడు, తను చేయించిన బంగారు తులసి దళాల క్రింద, మట్టి తులసిదళాలు కనిపించాయుట. స్వామి వారు చెప్పారుట ఈ మట్టి దళాలు, ఆ భీముడే సమర్పించాడు నాకు అని. అప్పుడు మనసులో అనుకున్నాడుట, మట్టి తులసి దళాలు స్వామికి నచ్చాయా, వీడు ఎవరో కాని వెంటనే వెళ్లి కలవాలని బయలుదేరాడుట. ఆ రోజు చాల ఎండగా ఉంది, అప్పటికే నడిచి నడిచి, భీముడి ఇంటి దగ్గరలో స్పృహ తప్పి పడిపోయాడుట. అప్పుడు ఆ భీముడే,తొండమాన్ చక్రవర్తి ని లేవదీసి తన ఇంటికి తీసుకువెల్లాడుట. తొండమాన్ చక్రవర్తి అడిగాడుట, ఒరేయ్ నువ్వు ఏమి చేస్తూ ఉంటావు? వేంకటేశ్వర స్వామి వారికి నువ్వంటే చాల ఇష్టం.

భీముడు అన్నాడు, నేనేం చేస్తాను స్వామి
- కుండ చేసేముందు ఈశ్వరా నన్ను అనుగ్రహించావు.
- కుండలు చేసుకునే శక్తి ని ఇచ్చావు.
- అవి అమ్మితే నాలుగు రూపాయలు వచ్చేట్టు చేసావు
- వాటి వల్ల నా సంసారం సాగుతోంది.
- నీకు కృతజ్ఞతగా ఒక మట్టి తులసి దళం చేసి నీ పాదాల యందు ఉంచుతాను అని అక్కడే ఉన్న కొయ్యతో చేయబడిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూర్తికి సమర్పించేవాడుట. ఏ పని మొదలుపెట్టినా "గోవింద" నేను చేయడమేమిటి? నీవే నాతో చేయించు కుంటున్నావు స్వామి అనేవాడుట?

అప్పుడు తొండమాన్ చక్రవర్తి అనుకున్నారుట,

వీడేమో - అంతా స్వామి వారే చేయిస్తున్నారు అని అనుకుంటున్నాడు,
నేనేమో - నేను చేస్తున్నాను అని సమర్పిస్తున్నాను.

ఇదే మనమందరము చేసే పెద్ద తప్పిదం.

భీముడు అన్నం తినే ముందు మట్టి తో చిన్న మూకుడు చేసి, అందులో అన్నం ముద్ద పెట్టి, స్వామి వారికి సమర్పించి తను తినేవాడుట. స్వామి వారు భీముడి భక్తి కి పొంగిపోయి శ్రీదేవి, భూదేవి సహితుడై, దివ్య విమానం లోంచి దిగి, భీముడి పాక ముందు ప్రత్యక్షమయ్యారుట. వెంటనే స్వామి వారు భీముడిని కౌగలించుకుని, భీముడు తన మీద చూపించే భక్తికి పొంగిపోయి, తన ఒంటి మీద ఉన్న ఆభరణాలన్ని భీముడి మెడలో వేసారు.
అలాగే శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, వారి ఆభరణాలన్నిభీముడి భార్యకి తొడిగారుట. స్వామి వారు గరుత్మంతుడిని పిలిచి ఈ జీవుడిని సశరీరంగా, వైకుంఠానికి తీసుకువెళ్ళమని ఆదేశించారు. ఇప్పటికి స్వామి వారి ఆనంద నిలయంలో మొదటి గడప దాటి పెట్టే నైవేద్యం కుండతో చేసిన పెరుగు అన్నం. ప్రతి రోజూ ఒక కొత్త కుండ చేసి అందులోనే నైవేద్యం పెడతారు. అదొక్కటే తింటారు స్వామి వారు.

సారాంశం:

ఎక్కడ భక్తి ఉందో అక్కడ వశుడై పోతాడు స్వామి.
ఎక్కడ గర్వం/అహంకారం ఉన్నాయో అక్కడ ఆయన ఉండరు.

సమస్త అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడాయన. ఈశ్వరా ఇదంతా
నీ సృష్టే తండ్రి, నేను నీకు ఏమైనా ఇవ్వగాలనా అని అనుకోవాలుట.
వట సావిత్రీ వ్రతం

ఈ వ్రతము సుమంగళి స్త్రీలకు చాల ఉత్తమమైన వ్రతము. బీదైన సంపన్నురాలైన వివాహిత కోరుకొనేది తన భర్త అయురరోగ్యములతో వర్దిల్లలనేది మొదటిది. ఈ వ్రతమును సావిత్రి అనుష్టించి తన భర్త సత్యవంతుని యమధర్మరాజుతో పోరాడి జీవిమ్పచేసుకున్న వ్రత విధానం.

జ్యేష్ట మాస పౌర్ణమి నాడు అనగా 23-06-2013 అనుష్టించ వలెను. ఈ రోజు ప్రొద్దుననే తలకు స్నానము చేసి మీ గృహమునకు దగ్గరగా వుండే దేవాలయములో మఱ్ఱి చెట్టుకు ఒక కుండ నీళ్ళు వేరు దగ్గర పోసి మఱ్ఱి చెట్టును మూడు సార్లు ప్రదక్షిణము చేసి నమస్కరించ వలెను.

అప్పుడు చెప్ప వలసిన శ్లోకం:
వట మూలే స్తితో బ్రంహ వట మధ్యే జనార్దనః వటాగ్రే తు శివం విద్యాత్ సావిత్రివ్రత సమ్యుత వట సిన్చామితే మూలం సలిలైహి రంరుతోపయైహి ||

ఈ విధముగా మఱ్ఱి చెట్టుకు నీరు పోసి ప్రదక్షణము చేస్తే మీ భర్త అయురరోగ్యములతో వుండి మీకు దీర్ఘ సౌమంగల్యము కలిగేటట్టు అశీర్వాదము లభిన్చును.

మీ గృహములో దేవుని సన్నిధిలో చెప్పుకోవలసిన సంకల్పము
మమ జన్మ జన్మని అవైధవ్యప్రాప్త్యే భర్తుహు చిరాయు రారోగ్య సంపదాది ప్రాప్తి కామనయ సావిత్రి వ్రతం కరిష్యే తర్వాత కలశము స్తాపించి ప్రాణప్రతిష్ఠ వరకు చేసి
అస్మిన్ చిత్ర కలశే వట వృక్షం బ్రమ్హానం సావిత్రిం సత్యవంతం ధర్మరాజం నారదంచ ఆవాహయామి షోడశోపచార పూజలు చేసి కింద చెప్పిన శ్లోకములతో అర్ఘ్యము ఇవ్వవలెను

౧ ఓంకార పూర్వికే దేవి వీణా పుస్తక ధారిణి వేదమాత నమస్తుభ్యం సౌభాగ్యంచ ప్రయచ్చమే

౨ ఓంకార పూర్వికే దేవి సర్వ దుక్ఖ నివారిణి, వేదమాతర్నమస్తుభ్యం అవైదవ్యం ప్రయచ్చమే

౩ పతివ్రతే మహాభాగే వన్హియానే సూచి స్మితే ద్రుడవ్రతే ద్రుడమతే భర్తుస్చ ప్రియవాడిని

౪ అవైధవ్యం చ సౌభాఘ్యం దేహిత్వం మామ సువాతే పుత్రాన్ పౌత్రామ్స్చ సౌక్యంస్చ గృహాణార్ఘ్యం నమోస్తుతే

౫ త్వయా సృష్టం జగత్సర్వం సదేవాసుర మానవం సత్యవ్రతధరో దేవా బ్రమ్హరూప నమోస్తుతే

౬ త్వం కర్మసాక్షి లోకానాం శుభాశుభ విశేషకః గృహాణార్ఘ్యం ధర్మరాజ వైవస్వత నమోస్తుతే

౭ అవియోగ యథా దేవా సావిత్ర్యా సహితస్య చ అవియోగాస్థథాస్మాకం భూయాత్ జన్మని జన్మని

తర్వాత ఒక కొత్త వెదురు చాటకు పసుపు పూసి కుంకుమ పెట్టి అందులో సౌభాగ్య ద్రవ్యములు పసుపు కుంకుమ గాజులు దువ్వెన అద్దం కాటుక సక్త్యానుసారం చీర లేకుంటే రవిక బట్ట తాంబూలం పెట్టి వయోవ్రుద్దురాలైన సుమంగలిని ఆహ్వానించి కాళ్ళకు పసుపు పూసి కుంకుమ పెట్టి వాయనము ఇచ్చి అక్షతలు ఆవిడకు ఇచ్చి దీర్ఘ సుమంగళిగా అస్సేర్వదించమని ప్రార్తించాలి

దీనివల్ల భర్తకు ఎటువంటి అపమృత్యు దోషములు వున్నాను అవి తొలగి మీరు దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతారు
సూర్యభగవానుడి దివ్య క్షేత్రం కోణార్క్ దేవాలయం

తన కిరణాలతో జగత్తును కాంతిమయం చేసే సూర్యభగవానుడిని పూజించనివారు ఉండరు. కేవలం హిందూమతం ఆచరణలో ఉన్న ప్రాంతాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా సూర్యుని దైవరూపంగా భావించి పూజించేవారున్నారు. అలాంటి సూర్యభగవానుడికోసం నిర్మించబడిన దేవాలయాల్లో దేశంలోనే ప్రసిద్ధి చెందినదిగా కోణార్క్‌లోని సూర్యదేవాలయాన్ని పేర్కొనవచ్చు.

ఒరిస్సాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరి జగన్నాథ ఆలయం నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఈ కోణార్క్ ఆలయం నిర్మించబడి ఉంది. సూర్యుని రథాన్ని పోలిన ఆకారంలో ఈ ఆలయం నిర్మించబడి ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ ఆలయాన్ని ప్రపంచవారసత్వ సంపదగా గుర్తించి యునిసెఫ్ రక్షిస్తోంది.

కోణార్క్ స్థల పురాణం
పురాణ కాలంలో శాపగ్రస్తుడై కుష్టురోగం బారినపడ్డ శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు కోణార్క్ దేవాలయానికి దగ్గర్లో ఉన్న చంద్రభాగ తీర్ధం వద్ద కూర్చుని సూర్యుని స్మరిస్తూ తపస్సు చేశాడు. ఆసమయంలో చంద్రభాగ తీర్థంలో స్నానం చేస్తుండగా అతనికి సూర్యభగవానుడి విగ్రహం లభించింది. దాన్ని సాంబుడు కోణార్క్ ఆలయం ఉన్న ప్రదేశంలో ప్రతిష్టించాడు.
అయితే ప్రస్తుతమున్న ఆలయంలో పురాణకాలంలో స్థాపించబడ్డ విగ్రహం కన్పించదు. ఆ విగ్రహం ఏమైంది అన్న విషయం ఇప్పటికీ రహస్యమే. ప్రస్తుతం కోణార్క్‌లో ఉన్న ఆలయాన్ని గంగ వంశానికి చెందిన మొదటి నరసింహదేవుడు నిర్మించినట్టుగా చెబుతారు. ఆరోజుల్లో దాదాపు 12 వందల మంది శిల్పులు పన్నెండేళ్ల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారు.

కోణార్క్ ఆలయ విశేషాలు
సూర్యుని రథం ఆకారంలో నిర్మించబడిన ఈ దేవాలయానికి ఇరువైపులా పన్నెండు జతల చక్రాలు చెక్కబడి ఉన్నాయి. అలాగే వారంలోని ఏడురోజులను సూచించే విధంగా ఏడుగురర్రాలు చెక్కబడి ఉంటాయి. ఈ చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా స్థానికులు ఖచ్చితమైన సమయాన్ని చెప్పగలరు.

సూర్య పరిభ్రమణాన్ని చూపించే విధంగా ఈ చక్రాలు చెక్కబడడం ఓ గొప్ప విశేషం. అలాగే ఈ దేవాలయంపై అనేక శృంగారభరిత శిల్పాలు సైతం చెక్కబడి ఉన్నాయి. కోణార్క్ ఆలయంలో మూల విరాట్టు లేకపోవడం కూడా ఓ చెప్పుకోదగ్గ విషయమే. అయితే ప్రతి ఏడాది ఇక్కడ రధసప్తమి సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు.

కోణార్క్‌లో సూర్యుని దేవాలయంతో పాటు అఖండాలేశ్వర దేవాలయం, అమరేశ్వర ఆలయం, దుర్గ, గంగేశ్వరీ, కెండూలీ, లక్ష్మీ నారాయణ, మంగళ, నీల మాధవ ఆలయాలు కూడా ఉన్నాయి.

ఈ సమయంలో భక్తులు దేవాలయానికి దగ్గర్లో ఉన్న చంద్రభాగ తీర్థంలో స్నానం చేసి దేవాలయంలో ఉన్న నవగ్రహాలను పూజిస్తారు. అద్భుతమైన శిల్పకళకు, ఆధునిక పరిజ్ఞానికి గుర్తుగా కోణార్క్ దేవాలయాన్ని పేర్కొనవచ్